కమిషన్ ను తాగిన పేపర్ లీకేజీ సెగ
![](https://udayum.com/wp-content/uploads/2023/04/TSPSC-Paper-Leak.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సెగ తాజాగా కమిషన్ కు తాకింది. సిట్ అధికారులు తాజాగా టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేసింది. నేడు ఈ ఇద్దరిని సిట్ అధికారులు విచారించనున్నారు. కమిషన్ లోని కాన్ఫిడెన్షియన్ విభాగం సెక్రటరీ పరిధిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో పేపర్ల తయారీ, భద్రపరచడం కోసం ఎలాంటి పద్ధతులు వినియోగాస్తారో అనితారామంచంద్రన్ ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇంకా ఆమె వద్ద సహాయకుడిగా పని చేస్తున్న ప్రవీణ్ పేపర్ లీకేజీకి పాల్పడడంతో ఆ వివరాలపై సైతం ప్రశ్నించే అవకాశం ఉంది. ఇంకా.. కమిషన్ సభ్యుడిగా ఉన్న లింగారెడ్డికి సహాయకుడిగా పని చేస్తున్న రమేశ్ కు సైతం గ్రూప్-1 పేపర్ అందింది. ఈ విషయంపై లింగారెడ్డిని ప్రశ్నించనుంది సిట్.
ఎంఎంటీఎస్ రెండో దశకు మోక్షం
హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ కూత పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. లక్షలాది ప్రజల సంవత్సరాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. నగరంలో ఏ మూల నుంచి అయినా మేడ్చల్ వెళ్లడం ఇక కష్టం కాదు.. అలాగే మేడ్చల్ నుంచి నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా వ్యయప్రయాసలుండవు. ఎంఎంటీఎస్ ఎక్కి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం సైతం కేవలం రూ.10-15 టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు. ఈ నెల 8న ప్రధానమంత్రి ఎంఎంటీఎస్ రెండోదశను లాంఛనంగా ప్రారంభించి మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్, మేడ్చల్-సికింద్రాబాద్-తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఏకే గుప్తా చెప్పారు.
నేటి నుంచే టోల్ మోత
![](https://udayum.com/wp-content/uploads/2023/01/Toll_gate_on_Vijayawada_-_Hyderabad_highway-1024x630.jpg)
టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెరుగుతాయి. దీనికి సంబంధించి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న హైదరాబాద్-విజయవాడ (65), హైదరాబాద్-వరంగల్ (163) జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు(నందిగామ), వరంగల్ హైవేపై బీబీనగర్ మండలం గూడురు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. తాజాగా టోల్‌ప్లాజా మీదుగా ప్రయాణించే వాహనాలకు వాటి స్థాయిని బట్టి ఒకవైపు, ఇరువైపులా కలిపి రూ.5 నుంచి రూ.40 వరకు, స్థానికుల నెలవారీ పాస్‌లపై రూ.275 నుంచి రూ.330 వరకు టోల్ రుసుములు పెరిగాయి. ఈ ధరలు 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు: జానారెడ్డి సంచలన వాఖ్యలు
![](https://udayum.com/wp-content/uploads/2023/04/jana-reddy-1024x777.jpg)
బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత పొత్తు తప్పదనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పొత్తులపై మరో 3 రోజుల్లో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జానారెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తులుంటామయని, అవసరమైతే శివసేనతోనూ జత కలుస్తామని జానారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.
నాలుగు రోజులు భారీ వర్షాలు
![](https://udayum.com/wp-content/uploads/2023/03/rains-in-telangana.jpg)
ఏపీ, తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మళ్లీ రాళ్లవాన వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
రాయితీలు ఎత్తేసిన మెట్రో
![](https://udayum.com/wp-content/uploads/2023/01/1200px-Hyderabad_Metro-1024x683.jpg)
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 అంటే ఈరోజు నుంచి మెట్రో రాయితీలలో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తివేయనున్నట్లు తెలిపారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈరోజు నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్డులపై డిస్కౌంట్ ఉండదు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ రాయితీ అమలులో ఉండనుంది. ఇక సెలవు రోజుల్లో ప్రయాణించేందుకు ఇస్తున్న హాలీడే కార్డు ధర 59 రూపాయల నుంచి 99కి పెంచనున్నారు. స్మార్ట్ కార్డ్స్ ధర కూడా పెంచబోతున్నారు.
ఎంసెట్ షెడ్యూల్ లో మార్పులు
![](https://udayum.com/wp-content/uploads/2023/03/TS-intermediate-time-table-2022-revised-Check-new-exam-dates-here-1024x768.jpeg)
టీఎస్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష యథాతథంగా జరగనుంది. నీట్, టీఎస్‌పీఎస్సీ పరీక్షల కారణంగా ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ పెద్దలను ఉరి తీసిన తప్పు లేదు: రేవంత్ రెడ్డి
![](https://udayum.com/wp-content/uploads/2023/04/339107351_173776628822782_2818779815907251710_n-1024x682.jpg)
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను.. అమరవీరుల స్థూపం ముందు ఉరితీసినా తప్పు లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవాహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి అనంతరం మీడియో మాట్లాడారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల.. 2వేల మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులు చనిపోయినా.. కల్వకుంట్ల కుటుంబానికి చీమకుట్టినట్లైనా లేదని భగ్గుమన్నారు. TSPSC పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిని శిక్షిస్తారని అనుకున్నామని.. కానీ పేపర్ లీక్‌పై ప్రశ్నించిన వాళ్లకు సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. TSPSC ఛైర్మన్, సెక్రటరీకి తెలియకుండా.. కంప్యూటర్లలోని డేటా బయటకు వచ్చే అవకాశం లేదన్నారు.