కనుల పండువగా రాములోరి కల్యాణం.. పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్: రంగంలోకి ఈడీ.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే.. బలగం సింగర్ మొగిలయ్యకు అండగా హరీశ్ రావు.. ఎంసెట్ ఎగ్జామ్ కు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?.. నేటి టాప్ న్యూస్ ఇవే..

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కల్యాణం కనులపండువగా సాగింది. రాష్ట్రప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

నేడు భద్రాచలానికి గవర్నర్

నేడు భద్రాచలంలో జరగనున్న సీతారామ చంద్రుల వారి పట్టాభిషేకం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్, భర్తతో కలిసి పాల్గొనున్నారు. అనంతరం పర్ణశాల సైతం వెళ్లనున్నారు. గవర్నర్ సికింద్రాబాద్ నుంచి కొత్తగూడం వరకు ట్రైన్ లో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం, పర్ణశాల వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

పేపర్ లీకేజీ కేసు: రంగంలోకి ఈడీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ఘటనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగనుంది. ఈ కేసులో లక్షల కొద్దీ రూపాయలు చేతులు మారినట్లు తేలడంతో ఈ రోజు కేసు నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు నిందితులను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవాలను ఈడీ పరిశీలించనుంది.

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత త్వరగా వెళ్లేందుకు వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది. ఈ రైలు మంగళవారం మినహా ప్రతి రోజూ ప్రయాణికులకు సేవలు అందించనుంది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు. ఛార్జీల వివరాలను రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. ఏప్రిల్‌ 8న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభిస్తున్నప్పటికీ ఆ రోజు ప్రయాణికులను అనుమతించబోరు. ఆ రోజు సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది.

ట్రైన్ టైమింగ్స్:
సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.
తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

ప్రధాని మోదీకి కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేసి దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఆరోపించారు. ఈ దోపిడీకి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను బూచిగా చూపి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. పెట్రోల్‌ ధరలపై కేటీఆర్‌ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక్క రూపాయి వ్యాట్‌ పెంచకున్నా, కేంద్రం మాత్రం సెస్సుల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందని ఆరోపించారు. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

ఎంసెట్ కు భారీగా దరఖాస్తులు

ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 1.80 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్‌ 10 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1,14,989, అగ్రికల్చర్‌ విభాగానికి 65,033, రెండు విభాగాలకు 218 దర ఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు మే 7న ప్రారంభమై 11 వరకు కొనసాగనున్నాయి. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌, 10, 11 తేదీల్లో అగ్రిక్చలర్‌ విభాగం పరీక్షలుంటాయి.

మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసును విచారణ చేస్తున్నా కొద్దీ.. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితులకు కేవలం ప్రశ్నాపత్రాలు మాత్రమే కాకుండా.. ప్రశ్నలతో పాటు జవాబులు కూడా ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్లు సైతం లీక్ అయినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. గ్రూప్‌‌ 1 సహా ఆరు పరీక్షలకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లను ప్రవీణ్ గ్యాంగ్ హ్యాకింగ్ ద్వారా లీక్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి మొత్తం 15 మాస్టర్ క్వశ్చన్ పేపర్లు నిందితుల చేతికి చేరినట్లు తేలింది. దీంతో అనేక మంది ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రిలిమ్స్ లో అర్హత సాధించినట్లు తేలింది. మరికొంత మందికి సైతం పరీక్షకు ముందే పేపర్ చేరిందన్న కోణంలో విచారణ సాగుతోంది.

నేటి జేపీ నడ్డా పర్యటన రద్దు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేటి తెలంగాణ పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను సైతం జేపీ నడ్డా వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

బలగం సినిమా సింగర్ కు అండగా హరీశ్ రావు..

బలగం సినిమాలోని ‘తోడుగా మాతో ఉండి’ పాటతో ఆకట్టుకున్న సింగర్ మొగిలయ్యకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్యకు కావాల్సిన మందులు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన అరోగ్య పరిస్థితి పై పూర్తి హెల్త్ చెకప్ చేసి, డయాలసిస్ సేవలు అందేలా ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేసి తిరిగి అంబులెన్స్ లో ఇంటికి చేర్చాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి హరీశ్ రావుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here