వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. నేడే ఫార్ములా ఈ  రేసింగ్.. ఏపీ సీఎం జగన్ తో పొంగులేటి భేటీ.. బండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

పోడు భూముల పంపిణీపై కేసీఆర్ గుడ్ న్యూస్

రాష్ట్రంలో చాలా రోజులుగా సాగుతున్న ‘పోడు’ భూముల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ లో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మొత్తం 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు అందజేస్తామని తేల్చిచెప్పారు. ఈ నెలాఖరు నుంచే పత్రాల పంపిణీని ప్రారంభిస్తామన్నారు. పోడు సాగుదారులకు రైతు బంధును అమలు చేస్తామని, విద్యుత్తు కనెక్షన్లు కూడా ఇస్తామన్నారు. అవసరమైతే గిరి వికాసం కింద నీటి వసతిని కల్పిస్తామన్నారు. పోడు హక్కులు పొందిన వారు.. భవిష్యత్తులో అడవులకు పూర్తి కాపలాదారులుగా ఉంటామని, ఇకపై గజం భూమిని కూడా ఆక్రమించబోమని, చెట్లను నరకబోమంటూ లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష నేతలందరూ ఈ మేరకు హామీ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. అలా ముందుకురాని చోట పట్టాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు.

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న ఆయనకు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా నోవాటెల్ కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. శనివారం సర్దార్‌ వల్లభ్ భాయ్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో జరగనున్న ఐపీఎస్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‭కు అమిత్ షా చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నారు.

తెలంగాణలో చిచ్చు పెట్టొద్దు: కేటీఆర్

ప్రగతి భవన్‌ను పేల్చేయాలని.. సచివాలయాన్ని కూల్చేస్తామని మరొకరు ఉన్మాదపు మాటలు మాట్లాడుతూ పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే విధానం మంచిది కాదని మునిసిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టవద్దని ప్రజలను కోరారు. ఐటీ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధాన నిర్ణయాలతో ఇప్పటి వరకు సుమారు రూ.3.87లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, సుమారు 22 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. బడ్జెట్‌ పద్దులపై శుక్రవారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 2014లో ఐటీ ఎగుమతులు రూ.57 వేలకోట్లు కాగా.. నేడు 1.83 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు


ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ధనదాహంతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ లో అతిపెద్ద కుంభకోణం పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో జరిగిందని తీవ్ర ఆరోపనలు చేశారు. ప్రభాకరరావు, రఘుమారావు, గోపాలరావులను కేసీఆర్ అడ్డంపెట్టుకుని వేలకోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ళ పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

వైశాలి కేసు నిందితుడి విషయంలో పోలీసుల కీలక నిర్ణయం

దాదాపు నలభై మందితో కలిసి, పట్టపగలు డెంటిస్ట్‌ వైశాలి ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్‌ చేసిన కేసులో.. నిందితుడు కొడుదుల నవీన్‌ రెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్‌ను ప్రయోగించారు. ఆదిభట్ల పోలీస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో.. కేసు తీవ్రత దృష్ట్యా రాచకొండ సీపీ డీఎస్‌. చౌహాన్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నవీన్‌రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

సీఎం జగన్ ను కలిసిన పొంగులేటి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను తాజాగా కలిశారు. తాడేపల్లిగూడెం వెళ్లిన పొంగులేటి.. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమై భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. పొంగులేటి గత కొంత కాలం నుంచి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. తొలుత ఆయన కాంగ్రెస్, బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం వైఎస్సార్టీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన వైఎస్ షర్మిలతో మంతనాలు కూడా సాగించినట్లు సమాచారం.

నేడే ఫార్ములా ఈ  రేసింగ్

హైదరాబాద్.. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ఇవాళ ఫార్ములా ఈ ప్రపంచ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది. దీని షెడ్యూల్ చూస్తే.. ఉదయం 8.10 నుంచి 8.40 వరకు ఫ్రీ ప్రాక్టీస్‌-2 ఉంటుంది. ఉదయం 10.40 నుంచి 12.05 వరకు క్వాలిఫయింగ్‌ రేసు ఉంటుంది. మధ్యాహ్నం 1.40 నుంచి 1.55 వరకు డ్రైవర్స్‌ పరేడ్‌ ఉంటుంది. మధ్యాహ్నం 3.04కి అసలైన రేసు మొదలవుతుంది. సాయంత్రం 4.35కి మీడియా సమావేశం జరిపి.. ఈ రేసు గురించి వివరిస్తారు.

వందేభారత్ రైలుపై దాడి

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్ళ దాడి చేశారు. ఈ -ఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగింద. మహబూబాబాద్ – గుండ్రాతి మడుగు స్టేషన్ ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. దీంతో రైలు -కోచ్ 4, కోచ్ 8 బయటి గ్లాస్ కు పగుళ్ళు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు -మహబూబూబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు.

బండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈ వాహనాన్ని ఆయనకు అందజేయనున్నారు. సంజయ్ భద్రత కోసం ఆయన మిత్రులు కొందరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తయారు చేయిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా బండి సంజయ్ వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. దీంతో భద్రతాపరంగా మరిన్ని జాగ్రత్తలు అవసరమని భావించన ఆయన మిత్రులు ఈ ఏర్పాట్లను చేస్తున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here