సచివాలయ ప్రారంభం వాయిదా.. బస్సు బోల్తా, 15 మందికి గాయాలు.. ఫార్ములా ఈ-రేసులో విజేత ఎవరంటే?.. తెలంగాణలో మరో 6 కొత్త గ్రామ పంచాయతీలు.. ఆ ఎమ్మెల్యేలను కట్టేయాలన్న రేవంత్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

సచివాలయ ప్రారంభం వాయిదా..


ఈ నెల 17న నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి సీఎస్, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆశాజనకంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. తదుపరి తేదీని తిరిగి ప్రకటించనున్నట్లు తెలిపింది. అయితే.. పనులు ఇంకా పూర్తి కకపోవడం.. సీఎం పుట్టిన రోజు నాడు సచివాలయాన్ని ప్రాంభించడం ఏంటన్న విమర్శలు రావడం కూడా వాయిదాకు కారణమన్న ప్రచారం కూడా సాగుతోంది.

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు జాతీయ రహదారి-44 పక్కన బోల్తాపడింది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో మొత్తం 15 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గిరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్సై నాగశేఖర్‌రెడ్డి, సిబ్బంది క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించివేశారు.

ముగిసిన ఈ-రేసు

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లారు. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు. విజేతకు మంత్రి కేటీఆర్ బహుమతి అందించి అభినందించారు.

తెలంగాణపై కేంద్రం కక్ష: హరీశ్ రావు

కృష్ణా నదీజలాల్లో వాటాను తేల్చకుండా కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందన్నారు. అపెక్స్ కమిటీలో కేంద్ర జలవనరుల మంత్రి ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టుల కేసును ఉపసంహరించుకున్నా కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం రాలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో కొత్తగా 6 పంచాయతీలు

రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. శుక్రవారం సవరణ బిల్లును పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భద్రాచలం మండలంలో భద్రాచలం, సీతారాంనగర్‌, శాంతినగర్‌, బూర్గంపాడు మండలంలో సారపాక, ఐటీసీ, ఆసిఫాబాద్‌ జిల్లాలో రాజంపేటను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు.

ఏప్రిల్ లో గొర్రెల పంపిణీ:

ఏప్రిల్ నెలలోనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశు సంవర్ధక శాఖ పద్దుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖకు అత్యధిక ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ ఇస్తున్నారని మంత్రి అన్నారు.

ఎల్లుండి కొండగట్టుకు కేసీఆర్

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం రానున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌ డిసెంబరు 7న జగిత్యాలలో కలెక్టరెట్‌ ప్రారంభానికి రాగ అదే రోజు కొండగట్టుకు వస్తారనే ప్రచా రం జరిగింది. అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అయితే అప్పుడు సీఎం పర్యటన రద్దుకాగ జగిత్యాలకు వచ్చిన కేసీఆర్‌ కొండగట్టు అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించారు. ఐగు రోజుల క్రితం వంద కోట్లకు సంబంధించిన జీవో కూడా ప్రభుత్వం జారీ చేసింది. దీంతో కొండగట్టు అభివృద్ధిపై ఆశలు పెరిగాయి. ఇందులో భాగంగానే వంద కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణ, మాఢవీదులు తదితర కార్యాచరణ రుపొందించడానికి గాను సీఎం 14న కొండగట్టుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

3.30 లక్షల కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులు ఏకాభిప్రాయానికి రావడంతో రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

పాదయాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల తూటాలు ఆగడం లేదు. తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల పంపిణీ వ్యవహారంపై స్పందించిన రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోడు పట్టాలు ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓట్ల కోసమే పోడు భూముల పంపిణీ

ఓట్లకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇస్తానని అంటున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వారిపై నిజంగానే ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర భాగంగా.. శనివారం జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేట గ్రామంలో పర్యటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 2019లో అసెంబ్లీలో ఆదివాసీ బిడ్డలకు పోడు భూములపై హక్కు ఉందని చెప్పి ఇప్పుడేమో షరతులతో కూడిన పట్టాలు ఇస్తానని అంటున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవాల్సి ఉండగా ఒక్క ఎకరానికి కూడా ఇవ్వకుండా లక్షల ఎకరాల్లో ట్రెంచ్‌లు వేసి మొక్కలు నాటారన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here