ధరణిని రద్దు చేయాల్సిందే.. రాష్ట్రంలో మరో ఎన్నికల సైరన్.. శాసనమండలి కొత్త డిప్యూటీ చైర్మన్ ఎవరంటే?.. పెళ్లిరోజే కల్యాణ లక్ష్మి చెక్కు.. పెట్రోల్ ధరలు తగ్గింపు అప్పుడే: కేంద్ర మంత్రి

ధరణిలో లోపాలుంటే సరి చేస్తాం:


ధరణి పోర్టల్ లో లోపాలు ఉంటే సరి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతేకానీ.. ధరణి పోర్టల్ మొత్తాన్ని తొలగించబోమని స్పష్టం చేశారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం, ప్రగ‌తి భ‌వ‌న్‌ను బ‌ద్దలు కొట్టడం, బాంబుల‌తో పేల్చివేయాలని అనడం కాంగ్రెస్ విధానామా? అని కాంగ్రెస్ స‌భ్యుల‌ను సూటిగా ప్రశ్నించారు. ధ‌ర‌ణి పోర్టల్‌ వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. గ‌త ఆరేళ్లలో 30 ల‌క్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 ల‌క్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయ్యాయన్నారు. ఒక‌ట్రెండు లోపాలు జ‌రిగితే రాష్ట్రమంతా గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని చెప్పడం స‌రికాద‌ని కేటీఆర్ అన్నారు.

ధరణి రద్దు చేయాల్సిందే:

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మధ్య ధరణి పోర్టల్ విషయంపై మాటల యుద్ధం సాగింది. ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారుతోందని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రైతులు గందరగోళంలో ఉన్నారని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు.

నేటి నుంచే బీజేపీ ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’

ఈ రోజు నుంచి తెలంగాణ బీజేపీ ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటటింగ్ లకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 11 వేల శక్తి కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్ పల్లి చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

రాష్ట్ర శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కాటేజీల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం మార్చి 29న.. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజవకర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సయ్యద్ అమీసుల్ హుస్సేన్ పదవీ కాలం మే 1న ముగియనుంది. ఇందుకు సంబంధించని ఎన్నికలు మార్చి 11న, కౌంటింగ్ మార్చి 16న నిర్వహించనున్నారు.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్ పదవీకాలం జూన్ 3న ముగియగా.. అప్పటి నుంచి ఎన్నిక జరగలేదు.

గొర్రెల పంపిణీపై మంత్రి గుడ్ న్యూస్

ఈ ఏడాది మార్చి నెలాఖరులో కానీ, లేదా ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నుంచి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలు ఉండగా.. కేసీఆర్ ఆ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచారని వివరించారు.

పెళ్లిరోజే కల్యాణ లక్ష్మి చెక్కు:

కల్యాణ లక్ష్మి పథకం చెక్కుల జాప్యంపై మంత్రి గంగుల కమలాకర్ కీలక వాఖ్యలు చేశారు. పెళ్లి జరిగే రోజే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. అయితే.. కొందరు పెళ్లి తర్వాత దరఖాస్తు చేసుకోవడంతో చెక్కుల పంపిణీలో జాప్యం జరుగుతోందన్నారు. లగ్నపత్రిక రాసుకున్న రోజే దరఖాస్తు చేసుకుంటే పెళ్లి రోజే చెక్కు అందుతుందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 12.19 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి చెందారని చెప్పారు.

ఎంసెట్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో సీట్లను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి కాళోజీ మెడికల్ యూనివర్సిటీ లేఖ రాసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఆ కోర్సులో చేరాల్సిన వారు ఎంసెట్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

అంతర్జాతీయంగా తగ్గితేనే పెట్రోల ధరల తగ్గింపు

అంతర్జాతీయంగా ఇంధనాల ధరలు తగ్గితేనే దేశీయ ఎల్పీజీ ధరలు తగ్గిస్తామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పరి తెలిపారు. ‘‘మేం దేశీయ ఎల్పీజీ ధరలను పెరగనివ్వలేదు. సౌదీతో మనం కుదుర్చుకున్న ఒప్పందం 330 శాతం పెరిగింది. కానీ.. కనిష్టంగానే ధరలు పెంచాం’’ అని ఆయన వివరించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here