కొత్త సచివాలయ ప్రారంభానికి కొత్త ముహూర్తం ఖరారు.. ’మేం గెలిస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్‘.. తెలంగాణ అప్పులు ఎన్ని లక్షల కోట్లంటే.. కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదాకు కారణమిదే.. హైకోర్టుకు దుబ్బాక ఎమ్మెల్యే.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే!

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తిచేయండి: మంత్రివర్గ ఉప సంఘం

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా కొలిక్కి తీసుకురావాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది. జిల్లాల వారీగా అర్హులు ఎంత మంది? ఎంత మంది లబ్ధి పొందారు? తదితర వివరాలతో నివేదికను రూపొందించాలని తెలిపింది. బీఆర్కే భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి తదితరులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమై పలు విషాలను చర్చించింది.

అంబేద్కర్ జయంతి రోజే నూతన సచివాలయ ప్రారంభం

తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని అంబేడ్కర్‌ జయంతి రోజే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్‌ 14న ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఫిబ్రవరి 17న కేసీఆర్‌ పుట్టినరోజు నాడు సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించగా.. శాసనమండలి సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్‌ రావడంతో ఎన్నికల కోడ్‌ రావడంతో వాయిదా వేశారు. అంబేడ్కర్‌ పేరుతో నిర్మిస్తున్న సచివాలయాన్ని ఆయన జయంతి రోజే ప్రారంభించాలన్న డిమాండ్లు గతం నుంచి వచ్చిన డిమాండ్లు రావడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాల నుంచి సమాచారం.

తెలంగాణ అప్పులు ఎన్ని లక్షల కోట్లంటే?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు కలిపి రూ.5.29 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో ప్రభుత్వ అప్పులు రూ.2,83,452కోట్లు ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు రూ.1,49,472 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఆ టెండర్లను రద్దు చేసిన ఇంటర్ బోర్డ్

తెలంగాణ ఇంటర్ పబ్లిక్‌, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మూల్యాంకనం కోసం అర్హులైన వారి నుంచి కోరిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కంట్రోలర్‌ తెలిపారు. ప్రశ్నపత్రాల స్క్రీన్ డిజిటల్‌ మూల్యాంకనం కోసం పిలిచిన టెండర్లలో కేవలం ఒకే సంస్థ పాల్గొనడంతో టెండర్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రద్దు పై ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పీ. మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్‌ బోర్డ్ లోకి మరోసారి అక్రమంగా ప్రవేశించడానికి గ్లోబరీన సంస్థ చేసిన ప్రయత్నాన్ని ఎండ కట్టడంలో ఇంటర్‌ విద్యా జేఏసీ విజయం సాధించిందన్నారు.

టీచర్ల బదిలీ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

ఉపాధ్యాయ బదిలీల కోసం మరో 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలను నిర్వహించాలని నిర్ణయించి, అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత , కోర్టు ఆదేశాల మేరకు.. కొత్త జిల్లాలకు బదిలీ అయిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ప్రక్రియ ఈ నెల 14న ముగుస్తుంది. గతంలో వచ్చిన 59 వేల దరఖాస్తులతో కలిపి ఇప్పటి వరకూ మొత్తం 67 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి పర్యటన వాయిదా పడింది. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లాలోని కొండగట్టును సందర్శించాల్సి ఉంది. మంగళవారం కొండగట్టుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున వారికి ఇబ్బందులు ఎదురుకావొద్దన్న ఆలోచనతోనే కేసీఆర్ తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

21 నుంచి యూజీసీ నెట్

యూజీసీ నెట్ డిసెంబర్ 2022 తొలి విడత పరీక్షలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మొత్తం 57 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ గెలిస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు మండలాల్లో సోమవారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే.. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందిస్తామని ప్రకటించారు.

నిధులు ఇవ్వాలని హైకోర్టుకు దుబ్బాక ఎమ్మెల్యే

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ను దుబ్బాకకు కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దుబ్బాకకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పిటిషన్ వేశారు. కేవలం సిద్దిపేట, గజ్వేల్కు మాత్రమే SDFను కేటాయిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు ఎమ్మెల్యే. రఘునందన్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, GAD ముఖ్యకార్యదర్శి, సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు, R &B అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. 

హైదరాబాద్ లో మరో 13 కొత్త పోలీస్ స్టేషన్లు

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కారు జీవో జారీ చేసింది. దోమలగూడ, లేక్ పోలీసు స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్బన్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలీచౌకి, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, బోరబండలో కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు జోన్లలో జోన్కు ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here