పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్:

విశాఖ నుంచి హైదరాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ వద్ద పట్టాలు తప్పింది. రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
టీచర్ల బదిలీలకు బ్రేక్

తెలంగాణ టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మార్చి14 వరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపటొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రాత్రికి అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది. టెన్త్ పరీక్షల తర్వాతే మళ్లీ బదిలీలకు ఛాన్స్ ఇచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్పౌజ్ టీచర్లకు పది అదనపు పాయింట్లను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, నాన్ స్పౌజ్ టీచర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలపై మార్చి14 వరకూ ఎలాంటి ప్రక్రియ చేపట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3–12 వరకూ టెన్త్ పరీక్షలు ఉన్నాయి. టెన్త్ వాల్యువేషన్ రెండు వారాలు ఉంటుంది. దీంతో ఆ తర్వాతే బదిలీల ప్రక్రియ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు సూచనాప్రాయంగా నిర్ణయించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వాఖ్యలు

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి రాలేదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. ఇద్దరికీ అరవై మించికి సీట్లు రావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ సెక్యులర్ పార్టీలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వాఖ్యలపై సొంత పార్టీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిష్టానానికి నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు.
నేను అలా మాట్లాడలేదన్న కోమటిరెడ్డి
తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగిన వేళ.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలకే కట్టుబడి ఉన్నానన్నారు. వరంగల్ సభలో రాహుల్ చెప్పినట్టుగానే ఏ పార్టీతో తమకు పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ‘‘నేను ఎలాంటి గందరగోళంలో లేను. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సర్వేల ఆధారంగానే మాట్లాడానన్నారు. తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. బీజేపీ వాళ్లే తన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారన్నారు. అధిష్ఠానం చర్యలు తీసుకోడానికి తను ఏ కమిటీలోనూ లేనన్నారు.
నేడు కొండగట్టుకు కేసీఆర్

కొండగట్టు దేవస్థానానికి సీఎం కేసీఆర్ నేడు రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.40 గంటలకు కొండగట్టు ఆలయానికి చేరుకోనున్న సీఎం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కొండగట్టు ఆలయ పరిసరాల్లో వంద కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనుల గురించి ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటన దృష్ట్యా కొండగట్టుపై ఏర్పాట్లను మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున కొండగట్టు మూలమలుపు బల్వంతాపూర్ వద్ద లారీ – ఆర్టీసి బస్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కరీంనగర్ కు చెందిన కండక్టర్ బొల్లం సత్యనారాయణ (సత్యం) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయలయ్యాయి.
రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన

తెలంగాణలో దిక్కుమాలిన పాలన నడుస్తోందని, మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే రూ.4.50 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం జనగామ జిల్లా లింగాలఘనపురం నెల్లుట్ల, పటేల్‌గూడెం క్రాస్‌రోడ్, కుందా రం, కిష్టగూడెం, చీటూరు, దేవరుప్పుల మండలం కోలుకొండ మీదుగా పాలకుర్తి మండలం శాతాపురం క్రాస్‌రోడ్ మీదుగా సాగింది.
టెన్త్ విద్యార్థులకు స్నాక్స్:

స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 34 రోజుల పాటు సాయంత్రం స్నాక్స్ అందించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్నాక్స్‌గా విద్యార్థులకు వేయించిన పల్లీలు, ఉడికించిన శనగలు, ఉడికించిన గుడ్లు, అరటిపండు, సమోసాలు, అటుకుల చుడువ, బెల్లం, సమోసాలు, పకోడి, బిస్కెట్ ప్యాకెట్ వంటివి అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.15 ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతిరోజూ రెండు సెషన్స్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. అయితే పరీక్షలకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు 040-24600110 అనే నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ఈ కాల్ సెంటర్ బుధవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనుంది.