Homelatestకొండగట్టుకు అభివృద్ధికి రూ.500 కోట్లు.. ఎన్టీఆర్ చిత్రంతో రూపాయల వెండినాణెం.. ఆ ఉద్యోగ దరఖాస్తు గడువు...

కొండగట్టుకు అభివృద్ధికి రూ.500 కోట్లు.. ఎన్టీఆర్ చిత్రంతో రూపాయల వెండినాణెం.. ఆ ఉద్యోగ దరఖాస్తు గడువు పొడిగింపు.. కాంగ్రెస్ కు 100 సీట్లు ఖాయం.. జేఈఈ సెషన్-2 దరఖాస్తులు ప్రారంభం.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

కొండగట్టు అభివృద్ధికి రూ.500 కోట్లు


బుధవారం కొండగట్టులో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటించారు. ఇక ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించగా..తాజాగా మరో 500 కోట్లను కేటాయిస్తూ సీఎం ప్రకటన చేశారు. ఇక యాదాద్రి ఆలయ అభివృద్ధి తరహాలోనే అంజన్న దేవాలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ పై అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు.

జేఈఈ సెషన్-2 దరఖాస్తులు ప్రారంభం:

దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియను ఎట్టకేలకు ప్రారంభించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 7 నుంచే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేసింది. అభ్యర్థులు మార్చి 12వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6,8,10,11,12 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఎన్టీఆర్ పేరిట వెండి నాణెం:

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌ పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని ముద్రించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్‌ కుమార్తె, బీజేపీ నాయకురాలు పురందేశ్వరితో మింట్‌ అధికారులు హైదరాబాద్‌లో సమావేశమై ఆమె సూచనలు, సలహాలు తీసుకుని డిజైన్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలోనే ఈ నాణేన్ని విడుదల చేసే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ:

ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన చేసిన దరఖాస్తుకు సీఎం జగన్ ఆమోదం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 12న అమరావతిలో సీఎ జగన్ ను మర్యాదపూర్వకంగా సోమేశ్ కుమార్ కలిశారు. అప్పటివరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

దరఖాస్తుల గడవు పొడిగింపు:

రాష్ట్రంలో 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు చేపట్టిన దరఖాస్తు ప్రక్రియ నిన్నటితో ముగియాల్సి ఉండగా.. గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది.

కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు ఖాయం:

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సమష్టిగా 10 నెలలు కష్టపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ దుఃఖం 10 నెలల్లో పోనుందన్నారు. ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. పాలకుర్తిలోని రాజీవ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకొంటున్న కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చి.. జనం మోసపోయారన్నారు.

బాగుపడింది కేసీఆర్ కుటుంబమే

అనేక మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం క్రాస్‌ రోడ్డు నుంచి తొర్రూరు, లక్ష్మీనారాయణపురం మీదుగా పాలకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు హరీశ్‌ రావు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు.

త్వరలోనే మెస్ ఛార్జీల పెంపు:

రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్‌ విద్యార్థుల మెస్‌చార్జీలను త్వరలోనే పెంచుతామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేటలో బస్తీ దవాఖానతోపాటు కేసీఆర్‌నగర్‌లో మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలను ప్రారంభించారు. విద్యార్థులకు మంచి విద్యతోపాటు మంచి భోజనం అందాలన్న ఉద్దేశంతోనే మెస్‌చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

మలన్నసాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించనున్న పంజాబ్ సీఎం

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌తోపాటు తొగుటలోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును గురువారం పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ సందర్శించనున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌తోపాటు గజ్వేల్‌ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను సందర్శించనున్నారు. పంజాబ్‌ సీఎం పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖల అధికారులు మంగళవారమే ఆయా ప్రాంతాలను సందర్శించారు. పంజాబ్‌ సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

రాష్ట్రానికి చెందిన 10 మంది అధికారులను కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్‌లుగా గుర్తించింది. కే అశోక్‌రెడ్డి, కే హరిత, పీ కాత్యాయనీదేవి, ఈవీ నర్సింహారెడ్డి, ఈ నవీన్‌ నికోలస్‌, ఏ నిర్మలాకాంతి వెస్లీ, కోట శ్రీవాత్సవ, చంద్రశేఖర్‌, ప్రియాంక, అరుణశ్రీకి ఐఏఎఎస్‌ హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీవోపీటీ) గెజిట్‌ జారీ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc