రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని కేక్ లు కట్ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ కారణజన్ముడిగా.. చిరస్మరణీయుడుగా.. ప్రజల తల రాతలు మార్చే మహానియుడుగా..మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మలయల్లో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని ఆమె తెలిపారు.
ఆ ఇద్దరు కేసీఆర్ గడిలో బానిసలు
మాజీ ఉపముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్ గడీలో బానిసల కంటే హీనంగా బతుకుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కొద్ది రోజులకే ఊడబీకి దళితులను కేసీఆర్ అవమానించారని ధ్వజమెత్తారు. వందల మంది ముందు వరంగల్ సభలో అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ అవమానించారన్నారు. దళితులను అవమానించిన కేసీఆర్‌కు దళితుల గూటం దెబ్బ చూపించాలని పిలుపునిచ్చారు.
దళిత బంధు పథకం కాదు.. దౌర్జన్య బంధు:
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ దోపిడితో విసుగెత్తి బహుజన సమాజ్ పార్టీ కి స్వచ్చందంగా మద్దతు ఇస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు.. రెండవ విడత బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిజాంసాగర్ లో ఆయన యాత్ర ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు పథకం.. దళితుల పైన దౌర్జన్య బంధు అని ధ్వజమెత్తారు. తమకు అధికారం ఇస్తే పేదలకు స్వపరిపాలన అందిస్తామన్నారు.
వైరల్ గా మారిన కెసిఆర్ మనవడు హిమాన్షు
ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కే తారక రామారావు కుమారుడు హిమాన్షు పాడిన ఆంగ్ల గీతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిమాన్షు తొలిసారిగా ఒక పాటను పాడి, దాన్ని యూట్యూబ్ మరియు ఇతర సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకున్నారు. ప్రసిద్ధ ఇంగ్లీష్ గీతం గోల్డెన్ అవర్ పాటకు కవర్ సాంగ్ రూపంలో తనలో ఉన్న ఈ కొత్త టాలెంట్ ని హిమాన్షు బయట పెట్టుకున్నారు. హిమాన్షు పాడిన పాటను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. తన కుమారుడు పాడిన పాట తనకెంతో బాగా నచ్చిందని, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. హిమాన్షు పాట తనకు ఎంతో గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.
ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం
ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామ శివారులో జాతీయ రహదారి 43 పై ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని డీకొంది. ఈ ఘటనలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉండగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాగపూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజధాని ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు సుమారు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పెర్కిట్ శివారులోకి రాగానే
ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిర్మలావి పచ్చి అబద్ధాలు
రాష్ట్రానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆమె రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారి ఝూటామాటలతో గోబెల్స్ ప్రచారమే చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల మంజూరుపై ఒక్కో కేంద్రమంత్రి ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం సమీకృత మార్కెట్ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
మంత్రి మల్లారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కోరారు. మేడ్చల్ జిల్లా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అధికారులు క్రీడా పోటీలు నిర్వహించారని, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో కోడ్ అమలులో ఉన్నప్పటికీ మంత్రి మల్లారెడ్డి క్రీడా వేదికపైకి వెళ్లారన్నారు. సీఎం కేసీఆర్‌ను కొనియాడుతూ ప్రసంగించారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు నిరంజన్ లేఖ రాశారు.