తారకరత్న కన్నుమూత.. తెలంగాణలో మరో ఎన్నికల నగారా.. ఆ ముగ్గురు పోలీసులపై వేటు.. హైదారాబాద్ లో పబ్ లు, ఫామ్ హౌజ్ లపై దాడులు.. నల్గొండ మీదుగా మరో వందే భారత్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

నందమూరి తారకత్న కన్నుమూత:

గుండెపోటుకు గురై 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న సినీహీరో, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు. జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్న ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసింది. అక్కడ చికిత్స తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు తారకరత్న. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు:

రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభంగా జరిగాయి. వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రముఖ శైశ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సీఎం కేసీఆర్ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఆ పోలీసులపై వేటు

చైన్‌ స్నాచింగ్‌ కేసులో ఖదీర్‌ఖాన్‌ అనే యువకుడి పట్ల మెదక్‌ పోలీసులు దారుణంగా వ్యవహరించడంతో అతను మరణించారన్న వార్తలు వస్తుండంతో డీజీపీ అంజనీ కుమార్‌ చర్యలు ప్రారంభించారు. ఘటనపై వరంగల్‌ రేంజ్‌ ఐజీ చంద్రశేఖర్‌ నేతృత్వంలో సమగ్ర విచారణకు ఆదేశించారు. ఖదీర్‌ను దారుణంగా హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారు. పట్టణ ఎస్సై రాజశేఖర్‌, ఇద్దరు కానిస్టేబుళ్లను తక్షణమే ఐజీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించామని మెదక్‌ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శనివారం తెలిపారు.

హిందూ సంఘాల ర్యాలీకి అనుమతి:

ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ నెల 19న హైదరాబాద్‌లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణకు హైకోర్టు శనివారం అనుమతి మంజూరు చేసింది. షేక్‌పేట నుంచి యూసఫ్ గూడ వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తును పోలీసులు తిరస్కరించడంతో నిర్వాహకుడు ఏవీ ప్రశాంత్‌ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ టీ. వినోద్‌కుమార్‌ ధర్మాసనం ర్యాలీకి పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ర్యాలీ యథావిధిగా జరుగనుంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నకల తేదీ ప్రకటన

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల తేదీని ప్రకటిస్తూ రక్షణ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. పార్లమెంటులో నూతన చట్టం అమలు చేసేందుకు ప్రక్రియ మొదలయినప్పటికీ బిల్లు పెండింగ్‌‌లో ఉండడంతో 2006 చట్టం ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించారు. రెండేండ్ల క్రితమే కంటోన్మెంట్ పాలక మండలి పదవీ కాలం ముగిసింది. ఏడాదిగా నామినేటెడ్ సభ్యుల ద్వారా పాలన సాగిస్తున్నారు.

సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టం: బండి సంజయ్

సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వేములవాడలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని కేసీఆర్ ను ఆ శివుడు, మోడీ తప్పకుండా చూస్తారని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని బండి సంజయ్ దర్శించుకున్నారు. రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తున్నా.. ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. యాదాద్రిని అభివృద్ధి చేసిన కేసీఆర్ వేములవాడను మర్చిపోయారు కానీ.. వేములవాడకు వచ్చిన భక్తులు ఆ శివుడిని, కేసీఆర్ ను మర్చిపోరని అన్నారు.

మధిర గురుకులంలో దారుణం

మధిరలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 10 వ తరగతి విద్యార్థినులను ప్రిన్సిపల్ కర్రతో చితకబాదారు. విద్యార్థినుల శరీరంపై కమిలిన గాయాలయ్యారు. కారణం లేకుండా కొట్టారంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.కూరలు సక్రమంగా వండకపోవటంతో అన్నంలో నీళ్లుపోసుకొని తింటున్నామని టెన్త్ విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు.

నల్గొండ మీదుగా వందేభారత్:

సికింద్రాబాద్‌ -తిరుపతి వందేభారత్‌ రైలును నల్లగొండ మీదుగానే నడుపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ముందుగా మూడు మార్గాలను అధ్యయనం చేశారు. బీబీనగర్‌, కాజీపేట, విజయవాడ మార్గం కన్నా, ప్రస్తుతం నారాయణాద్రి రైలు వెళ్లే మార్గంలోనే నడిపేందుకు మొగ్గు చూపినట్టు తెలిసింది. దీంతో సికింద్రాబాద్‌, బీబీనగర్‌, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి వెళ్లనున్నది. ఇదే మార్గంలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మీదుగా ఒంగోలు, నెల్లూరు. గూడూరు, కాళహస్తి మీదుగా సర్వే చేశారు. ముందుగా నారాయణాద్రి మార్గంలో పిడుగురాళ్ల వరకు నడిపి, అక్కడి నుంచి శావల్యాపురం వైపు మళ్లించే యోచన చేస్తున్నారు.

హైదరాబాద్ లో పబ్ లు, ఫామ్ హౌజ్ లపై దాడులు

హైదరాబాద్‌ (Hyderabad)లోని పబ్‌లు (Pubs), ఫామ్‌హౌజ్‌ల(Farmhouse)పై నగర పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి.. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో.. ఈ దాడులు చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న పబ్‌లతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌజ్‌లో సోదాలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. మదాపూర్‌లోని హాట్‌ కప్‌, బర్డ్‌ బాక్స్‌ పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా.. మైనర్లకు మద్యం సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్డ్ బాక్స్ పబ్‌కు లైసెన్స్ కూడా లేదని తెలిపారు. ఈ రెండు పబ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here