12 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక నిర్ణయం.. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంసెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి ఏం చర్చించారంటే?.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక నిర్ణయం


తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న 12 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపులకు సంబంధించిన పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపడతామని శుక్రవారం హైకోర్టు తెలిపింది. సోమేశ్ కుమార్ కు సంబంధించిన పిటిషన్ పై వచ్చిన తీర్పు అందరికీ వర్తించనది స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై రెగ్యులర్ బెంచ్ ఈ నెల 27న విచారణ చేపడుతుందని తెలిపింది. 11 మంది ఐఏఎస్, నలుగురు ఐపీఎస్ ల కేటాయింపులు చెల్లదంటూ క్యాట్ 2016లో ఇచ్చిన తీర్పు చెల్లదంటూ కేంద్రం.. సీనియార్టీ, పరస్పర బదలాయింపుకు అనుమతించాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్ లు నిన్న ధర్మాసనం ముందుకు వచ్చాయి.

రాష్ట్రంలో అమెజాన్ భారీ పెట్టుబడులు.. 50 వేల మందికి ఉపాధి..


తెలంగాణలో ప్రముఖ అమెజాన్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.16 వేల కోట్లను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ డబ్బులతో 2030 నాటికి 3 డేటా సెంట్లను అభివృద్ధి చెయనుంది. ఇప్పటికే రూ.20,096 కోట్ల పెట్టబడి పట్టాలని నిర్ణయించిన సంస్థ తాజా ప్రకటనతో ఆ పెట్టుబడులను రూ.36,300 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులతో మరో 50 వేల మంది ఉపాధి కలగనుంది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

27 నుంచి ఉపాధ్యాయ బదిలీలు


తెలంగాణలో ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ మేరకు షెడ్యూల్ రూపొందించాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ షెడ్యూల్ ఈ నెల 27 న మొదలై మార్చి 4 వరకు మొత్తం 37 రోజుల పాటు కొనసాగనుంది. నేడో, రేపో ఇందుకు సంబంధించిన జీవో విడుదల కానుంది. బదిలీల్లో డయాలసిస్, మస్కులర్ డిస్ట్రఫీ, థలసేమియా బాధితులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..


వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) పరీక్ష మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని మల్టీ-టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ ఎగ్జామ్‌ (ఎమ్‌టీఎస్‌)- 2022 పరీక్షలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ పరీక్ష కేవలం హిందీ, ఆంగ్లంలో నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ‘‘భాష కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోవద్దన్న ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు హిందీ, ఆంగ్లంతో పాటు ఉర్దూ, తమిళ్‌, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నాం. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న మిగతా భాషలనూ పరీక్షలో క్రమంగా చేర్చుతాం’’ అని ఆయన అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఇల్లెందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం సమాచారం అందడంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో క్షతగాత్రుడు రణధీర్‌ను చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతులు హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్‌, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్‌, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం వీరంతా మోతేకి వెళుతున్నట్లు సమాచారం.

తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్


తెలంగాణ ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. ఈ సారి ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండకపోవచ్చు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రాధమిక నిర్ణయానికి వచ్చింది. ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు సైతం ఎంసెట్ పరీక్షకు హాజరవుతుండడం.. ఏ ఒక్క రిజల్ట్ విడుదల ఆలస్యమైనా ఆ ప్రభావం ఎంసెట్ ఫలితాలపై పడడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న ఠాక్రే


ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే సూచించారు. విభేదాలు వీడి ఐక్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలను చేయాలని సూచించారు.

కలిసిన కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి


చాలా కాలం నుంచి ఉప్పు, నిప్పుగా ఉంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. జనగామ పీసీసీ పదవిని కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ ను వెంకట్ రెడ్డి అడిగినట్లు సమాచారం.

ఈ నెల 23న టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం


తెలంగాణ టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే చేపట్టే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు.

కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లపై కీలక తీర్మానాలు
వివాదాస్పదంగా మారిన కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్లను రద్దు చేయాలని ఆయా పాలకవర్గాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపించాయి. ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here