గవర్నర్ పై సుప్రీంకోర్టుకు కేసీఆర్ సర్కార్.. రాష్టరంలో భారీ పెట్టుబడి, లక్ష మందికి జాబ్స్.. బీఆర్ఎస్ లోకి మహారాష్ట్ర నుంచి భారీ చేరికలు.. 10న ఢిల్లీలో కవిత దీక్ష.. సూర్యాపేటలో అరుదైన ఆపరేషన్.. నేటి టాప్ న్యూస్ ఇవే..

గవర్నర్ పై సూప్రీంకోర్టుకు కేసీఆర్ సర్కార్

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదని పిటిషన్లో పేర్కొంది. తన పిటిషన్లో ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శిని చేర్చింది. శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

తెలంగాణలో లక్షమందికి ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్’ (Hon Hai Foxconn in) సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ (Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి లభించనుంది.

బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రావొద్దన్న రేవంత్

‘‘బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి బీజేపీకి అధ్యక్షుడి అయ్యాడు. తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదు. కరీంనగర్ కు చేసింది ఏమీ లేదు. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ రావొద్దు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా గురువారం హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని కట్కూరు క్రాస్ రోడ్డు నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని అన్నారు. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద తెలంగాణను సాకారం చేస్తా అనే ప్రకటించారన్నారు. కేసీఆర్, వినోద్ ఎంపీలు అయిన తెలంగాణ రాలేదన్నారు. పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీ అయి తెలంగాణ తెచ్చారన్నారు.

బీఆర్ఎస్ లోకి మహారాష్ట్ర నుంచి భారీ చేరికలు

మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలు నిన్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తంగా విస్తరించాలని అందుకు తమ రాష్ట్రంలో తమ వంతుగా కృషి చేస్తామని వారు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో.. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వసంత్ రావ్ బోండె , కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ జనరల్ సెక్రటరీ విఠల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జడ్జీ సభ్యులు సరిత వర్కడ్, కిన్వత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన, ఎంఎన్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధన్ లాల్ పవన్ , నాందేడ్ జడ్పీ సభ్యుడు నందతాయ్ పవార్, శిర్షేనా, నాందేడ్ జిల్లా మాజీ అధ్యక్షులు సునిత భబలికన్ తదితరులు ఉన్నారు.

నిమ్స్ లో చిన్నారులకు బ్రిటన్ డాక్టర్లచే శస్త్ర చికిత్సలు

నిమ్స్ హాస్పిట‌ల్ లో గ‌త నాలుగు రోజుల‌కుగా చిన్నారుల‌కు అరుదైన గుండె స‌ర్జ‌రీలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 8 స‌ర్జ‌రీలు పూర్త‌య్యాయి. ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు బ్రిట‌న్ నుంచి డాక్ట‌ర్ వెంకట ర‌మ‌ణ దన్నపునేని నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందం నిమ్స్ వైద్యుల, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్స్ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంలో ఈ స‌ర్జ‌రీలు నిర్వ‌హించారు. ప్రైవేటు లో దాదాపు రూ.5 లక్షల దాకా అయ్యే ఈ చికిత్సను పేద చిన్నారులకు ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. తాజాగా నెల రోజుల వ‌య‌సున్న శిశువుకు స‌ర్జ‌రీనీ విజయవంతంగా నిర్వహించారు.

సూర్యాపేట శ్రీ స్వాతి హాస్పిటల్ లో అరుదైన శాస్త్ర చికిత్స

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ స్వాతి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన పొన్నేబోయిన శ్రీనివాస్ భార్య శశిరేఖ గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ పట్టణంలోని పలు హాస్పిటల్ కి సందర్శించింది. అయినా.. ఫలితం తేలకపోవడంతో సూర్యాపేట శ్రీ స్వాతి హాస్పిటల్లో డాక్టర్లు సంప్రదించింది. స్కానింగ్ చేయించగా కడుపులో కణితి ఉందని గుర్తించిన శ్రీ స్వాతి హాస్పిటల్ వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు 7 నుండి 8 కిలోల గడ్డను తొలగించింది. దీంతో శశిరేఖ కుటుంబ సభ్యులు స్వాతి హాస్పిటల్ వైద్య బృందానికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 10న ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష

మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ పై బీజేపీ చేర్చిందని గుర్తు చేశారు. ఆ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కేవలం మూడు పార్లమెంటు సమావేశాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని అన్నారు.

బాయిలర్ పేలి ఐదుగురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం శ్రీకర పరిశ్రమలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న ఉదయం ఈ సంఘటన జరగగా.. పరిశ్రమ యాజమాన్యం లోలోపల కార్మికులను హాస్పటల్ తరలించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు 90% పూర్తిగా కాలినట్లు తెలుస్తోంది. కార్మికులు ఎస్ఎల్ఎన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. బాయిలర్ లో మెటీరియల్ వేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తోటి కార్మికులు చెబుతున్నారు.

రాష్ట్రపతి పాలనకు పోరాటం చేద్దాం: షర్మిల

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడిపోరాటం చేద్దామని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, విపక్ష నేతలను కోరారు. అఖిలపక్షంగా ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలుద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ సర్కారును బర్తరఫ్‌ చేయాల్సిన అవసరాన్ని రాష్ట్రపతికి తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు కొనసాగుతున్నాయని, ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, రాళ్ల దాడులు జరుగుతున్నాయని వివరించారు. ఈ మేరకు షర్మిల, గురువారం, అన్ని విపక్ష పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు రాశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here