హైదరాబాద్ లోని ఆ రాష్ట్ర వాసుల కోసం రూ.5 కోట్లు.. బిల్డింగ్ పై నుంచి దూకిన టెన్త్ స్టూడెంట్?.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సంచలన హామీలివే.. ప్రీతి కేసు విచారణలో సైఫ్ ఏం చెప్పాడంటే.. ఇంటర్ విద్యార్థుల కోసం బోర్డు కీలక నిర్ణయాలు.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

హైదరాబాద్ లో ఉంటున్న కర్ణాటక వారికి కేసీఆ..ర్ గుడ్ న్యూస్

కన్నడిగుల కోసం హైద్రాబాద్ లో గల సాహిత్య వేదికను పునరుద్దరించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్నాటక వాసులు మరియు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్జప్తి మేరకు సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కాచిగూడలో గల ‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లను సిఎం కేసీఆర్ మంజూరు చేశారు.

తెలంగాణలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం?

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఖమ్మం నగరంలోని ఇల్లందు రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ మూడో అంతస్తు నుండి దూకి టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో ఆ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఉద్యోగులు, సిబ్బంది వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనను గోప్యంగా ఉంచి విచారిస్తుండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న PDSU నాయకులు ఆ స్కూల్ పై దాడికి దిగి, ఆందోళన నిర్వహించారు.

మేమే అధికారంలోకి వస్తే రూ.500 లకే గ్యాస్ సిలిండర్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. అందుకు మీ ఆశీర్వాదం కావాలని ప్రజలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదల వైద్యానికి రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా చర్యలు చేపడుతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని స్పష్టం చేశారు. పేద రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేసి ఆదుకుంటామన్నారు. కొత్త ప్రభుత్వంలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ధరణి దందాలపై విచారణ చేపట్టి.. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని మరో సారి స్పష్టం చేశారు.

నేను ప్రీతీని వేధించలేదు: సైఫ్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతీ ఆత్మహత్మకు సంబంధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అయితే.. ఈ కేసులో నిందితుడైన సైఫ్ పోలీసు విచారణలో తాను ఎలాంటి తప్పు చేయాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘నేను సీనియర్‌ని, నేనంటే భయముండాలి’ అని మాత్రమే అన్నానని సమాచారం. వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా పోలీసులు సైఫ్ ను విచారించారు. గత మూడు నెలల్లో ప్రీతి, సైఫ్‌ వరంగల్‌లోని ఏయే ఆస్పత్రుల్లో కలిసి పని చేశారనే అంశంపై పోలీసులు దృష్టి సారించలేదు. సైఫ్‌ చెప్పిన సమాధానాలకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల నుంచి వివరాలు సేకరించారు. వీరు డ్యూటీ చేసే సమయంలో పనిచేసిన పీజీ విద్యార్థులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

రెరా చైర్మన్ గా శాంతికుమారి


తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) బాధ్యతలను తాత్కాలికంగా సీఎస్‌ శాంతికుమారికి సర్కారు అప్పగించింది. శాశ్వత అథారిటీ ఏర్పాటయ్యే దాకా ఈ బాధ్యతలను సీఎస్‌ చూస్తారని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ (నియమావళి అభివృద్ధి) చట్టం-2016ను అనుసరించి శాంతికుమారికి బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

మైనార్టీ కమిషన్ చైర్మన్ గా తారిఖ్ అన్సారీ

తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అన్సారీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడతానన్నారు.

ఎమ్మెల్సీ కవితపై షర్మిల సంచలన ఆరోపణలు


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కవిత కొత్త రాగం ఎంచుకుందని ఆరోపించారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్లుందని తీవ్రంగా విమర్శించారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కవిత మహిళలకే తలవంపు తెచ్చారని ధ్వజమెత్తారు. ఇపుడు ఆ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలంటూ ఆరోపించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని.. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ముందని సూచించారు.

పలు పరీక్షల తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ

తెలంగాణలో పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్) వెల్లడించింది. ఈనెల 15, 16న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామక పరీక్ష, ఏప్రిల్‌ 4న హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఏప్రిల్‌ 23న సహాయ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) నియామక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

ఇంటర్ విద్యార్థుల కోసం బోర్డ్ కీలక నిర్ణయం

తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతురన్న విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ‘టెలి-మానస్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ‘టెలి-మానస్’ పేరుతో సైకాలజిస్టుల సేవలు అందించనుంది. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 14416 ప్రకటించింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి ఉచితంగా మానసిక వైద్యులను సంప్రదించవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here