నిన్న ఖర్గే.. నేడు మోడీ.. కోమటిరెడ్డి అటా.. ఇటా
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటారా.. బీజేపీలో చేరుతారా.. అనే సస్పెన్స్ కొనసాగుతుంది. వెంకట్‌రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై పలు విజ్ఞప్తులు అందించేందుకు నేడు ప్రధాని మోడీని కలుసుకోనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో అపాయింట్మెంట్ ఖరారైందని తెలుస్తోంది. గురువారమే ఆయన కాంగ్రెస్ చీప్ మల్లికార్జున ఖర్గేతో పార్లమెంట్ ఛాంబర్లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో కొనసాగుతోన్న సీనియర్ల రాజీనామాలు ఆగే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్కు వీఆర్ఎస్ : జేపీ నడ్డా
ఉట్టికి ఎగురనమ్మ ..నింగికి ఎగురుతానన్నట్లు కేసీఆర్ కలలు కంటున్నాడని బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా అన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్..ఆ తర్వాత వీఆర్ఎస్ ఖాయమని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు మద్దతిస్తే ఏటీఏం సర్కారు బదులు వరిజినల్ సర్కారు అధికారంలోకి వస్తుందని అన్నారు. కరీంనగర్లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం వెనుకబడిన పీడిత ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా పని చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి. ధరణి పోర్టల్, డబుల్ బెడ్రూం ఇళ్లు అని ప్రజలను మోసం చేశాడని.. తాను ఫామ్ హౌస్ కట్టుకొని పేదలను మరిచిపోయాడని మండిపడ్డారు. అందుకే సాలు దొర ..సెలవు దొర నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు.
48 గంటలు రాళ్ల గుట్లలో.. రాజు మృత్యుంజయుడు
కామారెడ్డి జిల్లాలో జంతువుల షికారుకు వెళ్లి రాళ్ల గుహలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 48 గంటల పాటు అందులోనే కొట్టుమిట్టాడిన రామారెడ్డి మండలం సింగరాయపల్లికి చెందిన రాజు.. మృత్యుంజయునిగా రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడిని బండ రాళ్ల కింది నుంచి బయటకు తీసేందుకు రెవిన్యూ, ఫైర్, పోలీస్, ఫారెస్ట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ సిబ్బంది నిర్విరామంగా 23 గంటల పాటు నిర్వహించిన రెస్య్కూ ఆపరేషన్ విజయవంతమైంది. కంప్రెషర్లతో రాయిని పగులగొట్టి అందులో ఇరుక్కున్న రాజును బయటకు తీశారు.
ఢిల్లీలో బిజీ బిజీగా గడిపిన సీఎం
పార్టీ ఆవిర్భావం అనంతరం.. రెండో రోజు కూడా, ఢిల్లీ లో బి ఆర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సందర్శకులు ప్రజా ప్రతినిధులతో గురువారం రోజంతా సీఎం బిజీ బిజీ గా గడిపారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన ఒవైసీ తన కూతురు వివాహానికి రావాలని వివాహ ఆహ్వాన పత్రిక ను అందించారు. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ సీఎంను కలిసి శుభాకంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసులో తీర్పు నేడే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన వేర్వేరు రిట్ పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. గురువారం ఇరుపక్షాల వాదనలు పూర్తి కావటంతో జడ్జిమెంట్ రిజర్వు చేసింది. సిట్‌కు బదులు ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు కోరుతూ పిటిషనర్లు రిట్లు వేశారు. సిట్‌కు సారధ్యం వహిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్‌ను ప్రభుత్వం డీజీపీ చేసే అవకాశం ఉందని.. అందుకే ప్రభుత్వానికి అనుకూలంగా సిట్ దర్యాప్తు సాగుతుందని వాదించారు. సీఎం సీల్డ్ కవర్‌ల్లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలకు పంపటం అటువంటి సంకేతాలు జారీ చేసిందని అన్నారు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డిపై పలు కేసులు ఉన్నాయని గుర్తు చేశారు.
తాండూరు కందిపప్పుకు జీఐ గుర్తింపు
రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలో విస్తారంగా పండించే కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు దక్కింది. తాండూరు కందిపప్పుతోపాటు అస్సాం గమోసా లద్దాఖ్ యాప్రికాట్ మహారాష్ట్రకు చెందిన అలీబాగ్ వైట్ ఆనియన్లకు సైతం భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించింది. వీటితో కలిపి దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కి చేరింది.
మే 7న నీట్.. జనవరి 24 నుంచి జేఈఈ
జేఈఈ మెయిన్స్ (JEE MAINS 2023), నీట్ (NEET 2023) పరీక్షల తేదీ ఖరారైంది. జేఈఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. జనవరి 12 వరకు అప్లికేషన్లకు తుది గడువు విధించింది. జనవరి 24 నుంచి 31 వరకు మొదటి సెషన్ పరీక్షలు జరుగుతాయి. సెకండ్ సెషన్ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. మే 7వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూలు రిలీజ్ చేసింది.
అక్కడ పెండ్లిళ్లకు డీజే, బ్యాండ్ బంద్
డీజే, బ్యాండ్ వాయిస్తే నిఖా జరిపించొద్దని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ముస్లిం మహాసభ తీర్మానించింది. ముస్లింల వివాహ వేడుకను సింపుల్‌గా నిర్వహించాలని, ఇందుకు సంఘాలను ఒప్పించేందుకు మత గురువులు సహకరించాలని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో పెండ్లీల టైంలో డ్యాన్స్‌లు, పెద్ద సౌండ్ ప్లే చేయడం, పటాకులు పేల్చడం వంటివాటినిముస్లిం మత పెద్దలు బ్యాన్ చేశారు. ఆర్డర్‌ను ఉల్లంఘించిన వారికి ఫైన్ వేస్తామని హెచ్చరించారు.