శ‌ర‌ద్ యాద‌వ్ హఠాన్మరణం.. ఆ కుట్రలను అడ్డుకోవాలని కేసీఆర్ పిలుపు.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ రోజే గ్రూప్-1 ఫలితాలు?.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే

శ‌ర‌ద్ యాద‌వ్ హఠాన్మరణం


మాజీ కేంద్ర మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ (75) గురువారం రాత్రి క‌న్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న శరద్ యాదవ్‌ను చికిత్స కోసం ఆయ‌న కుటుంబ స‌భ్యులు గుర్‌గ్రామ్‌లోని ఫొర్టిస్ ద‌వాఖాన‌లో చేర్చారు. కానీ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న క‌న్నుమూశార‌ని వైద్యులు తెలిపారు. శరద్ యాదవ్ మరణించిన విషయాన్ని ఆయన కూతురు సుభాషిణి శరద్ యాదవ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. శ‌ర‌ద్ యాద‌వ్‌ జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ఏడు సార్లు లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 2018లో లోక్‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ అనే పార్టీని ఆయన స్థాపించారు.

యువతే దేశానికి కీలకం: మోదీ


యువతే దేశానికి చోదక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాభివృద్ధిలో రానున్న 25 ఏళ్లు చాలా కీలకమన్నారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో 26వ నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత కలలు, వారి ఆకాంక్షలే భారతదేశ దశ, దిశలను నిర్ణయిస్తాయని అన్నారు. వాళ్ల అభిరుచులే దేశాభివృద్ధికి మార్గం చూపిస్తాయని చెప్పారు. యువశక్తిని ఉపయోగించుకోవాలంటే.. మన ఆలోచనల్లోనూ, ప్రయత్నాల్లోనూ కొత్తదనం ఉండాలన్నారు. ఏ కార్యం చేపట్టినా ఉపయోగకరంగా, ఆచరణాత్మకంగా ఉండాలన్నారు. ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయంటే.. దానికి కారణం యువశక్తే అని మోదీ అన్నారు. వాళ్ల అంకిత భావమే యావత్‌ ప్రపంచం భారత్‌ వైపు చూసేలా చేస్తోందని మోదీ అన్నారు.

దేశాన్ని రక్షించుకుందాం: కేసీఆర్


ఎక్కడినుంచో ఓ వెలుగుదివ్వె, ఓ చైతన్య జ్యోతి వెలగకపోతే.. ఈ దేశం అంధకారంలోనే ఉండిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మతపిచ్చిగాళ్ల నుంచి దేశాన్ని రక్షించుకోవాలని, లేదంటే తాలిబన్‌ రాజ్యం తీసుకొస్తారని హెచ్చరించారు. మహబూబాబాద్‌, కొత్తగూడెం జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ సముదాయాలను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని చీల్చే కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని, ఆ పోరాటం తెలంగాణ గడ్డ నుంచే మొదలుకావాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దీనికి చాలామంది ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. యువత, బుద్ధిజీవులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: కేటీఆర్


తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ముంబైలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ప‌లువురు పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో స‌మావేశ‌మ‌య్యారు. టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రశేఖరన్‌ను కేటీఆర్ కోరారు.

ఐక్యంగా పనిచేయండి: కాంగ్రెస్ కొత్త ఇన్జార్జి


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటింకీ చేర్చేందుకు హాథ్ సే హాథ్ అభియాన్ యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యాత్రలో నేతలంతా ఐక్యంగా పాల్గొనాలని దిశానిర్ధేశం చేశారు. 2023లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ నెల 21న మరో సారి రాష్ట్రానికి వచ్చి మూడు రోజుల పాటు నేతలకు అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ నేతలు తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తానన్నారు.

కాలుష్యంపై హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..


హైదరాబాద్ మహానగరంలో నివసించే వారికి గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా కాలుష్యం తక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ టాప్‌ టెన్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా 131 నగరాల్లో సర్వే చేయగా.. హైదరాబాద్ మహానగరానికి ఆరో స్థానం దక్కడం విశేషం. హైదరాబాద్ లో పీఎం 10 పరిమాణం కలిగిన దుమ్ము, ధూళి కణాలు క్యూబిక్‌ మీటరుకు 71.3 మైక్రో గ్రాము చొప్పునే ఉన్నాయని నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగాం (ఎన్సీఏపీ) వెల్లడించింది.

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్


ఏపీలోని సీఎం జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాజకీయ వివాదంగా మారిన జీవో నెంబర్ 1పై అమలును నిలిపివేసింది. ఈ నెల 23వ తేదీ వరకు ఈ జీవో అమలుపై స్టే విధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించారు. దీంతో, బహిరంగ సభల నిర్వహణపైన ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 1 పేరున రోడ్ల పైన బహిరంగ సభలను నిషేధించింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతితో సభల నిర్వహణకు వీలుగా జీవో జారీ చేశారు. దీని పైన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదే అంశం పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు జీవో అమలు పైన స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

18న కంటి వెలుగు ప్రారంభం


కంటివెలుగు రెండు దశను ఈ నెల 18న మధ్యాహ్నం 1 గంటకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఖమ్మం నుంచి ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ పథకాన్ని ప్రారంభించిన వెంటనే అన్నిజిల్లాల్లో కంటి పరీక్షలు మొదలు పెట్టేలా అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని దిశానిర్ధేశం చేశారు.

ఈరోజే గ్రూప్-1 ఫలితాలు?


తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీఎస్పీఎస్సీ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రంలోగా ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఏమైనా సంకేతిక ఇబ్బందులు తలెత్తితే రేపు విడుదల చేసే అవకాశం ఉంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వాఖ్యలు


తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరరం కోమటిరెడ్డి మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. గంతంలో తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయన్నారు. పీసీసీ కమిటీలను తాను అసలు పట్టించుకోనని నాలుగైదు సార్లు ఓడిపోయినవాళ్లు పీఏసీలో ఉన్నారని అలాంటి వారితో తాను కూర్చోవాలా ? అని ప్రశ్నించారు. తమ ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదని కోమటి రెడ్డి అన్నారు. తన ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీ తనకు చెప్పారన్నారు.

సోమేశ్ కుమార్ పై విచారణకు బండి సంజయ్ డిమాండ్


317 జీవో తీసి ఉద్యోగుల ఉసురు పోసుకున్న సీనియర్ ఐఏఎస్, తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఉసురు తాకిందని, హైకోర్టు చెంప చెళ్లుమనిపించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇన్నేళ్లుగా సీఎస్ గా సోమేశ్ కుమార్ చేసిన దుర్మార్గులు, అవినీతి, అక్రమాలు, అనాలోచిత నిర్ణయాలపై విచారణ జరపాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎస్ పై క్రిమినల్ కేసు పెట్టి ఆయన సంగతి చూడాల్సిందేనన్నారు. ఇప్పటికైనా హైకోర్టు ప్రభుత్వం తీర్పుతో బుద్ది తెచ్చుకుని ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలి. తెలంగాణ క్యాడర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వాలన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here