సిట్టింగ్ ఎమ్మెల్యేలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ఈ నిర్ణయం వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అటు టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తి రేపుతోంది. సిట్టింగ్‌లకు టికెట్లు ఇస్తే టీఆర్ఎస్కు లాభం జరుగుతుందా..? లేకుంటే దెబ్బతింటుందా..? అనే చర్చకు తావిచ్చింది. ఆన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు మళ్లీ పోటీ చేస్తే.. వారిలో ఎంత మంది గెలిచే అవకాశముంది.. ఎంత మంది ఓడిపోయే ప్రమాదముంది.. అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 88 సీట్లను గెలుచుకుంది. వరుసగా మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవటం.. నాలుగేండ్లలో చోటు చేసుకున్న రకరకాల పరిణామాలు.. ఉప ఎన్నికల కారణంగా . టీఆర్ఎస్ బలం 102కు చేరుకుంది. వీరందరినీ మళ్లీ పోటీకి దింపాలని టీఆర్ఎస్ బాస్ తీసుకున్న తాజా నిర్ణయంతో 2023 ఎన్నికలకు సైరన్ ఊదినట్లయింది. అదే సమయంలో 102 మందిలో సునాయాసంగా గెలిచే సిట్టింగ్‌లు ఎందరు ఉన్నారు… ఆయా నియోజకవర్గాల్లో ఎంతమందికి ఓట్ల గండం పొంచి ఉందనే విశ్లేషణలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజాదరణ.. ప్రజల్లో వ్యతిరేకతను పక్కనబెడితే.. గత ఎన్నికల్లో బొటాబోటీ ఓట్ల మెజారిటీతో బయటపడ్డ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నిక గండమే. అంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఈసారి సొంత నియోజకవర్గాల్లో కత్తి మీద సాము తప్పదు. ఈ లెక్కన చూస్తే.. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేల్లో 26 మంది అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డ వారే ఉన్నారు. కేవలం పది వేల ఓట్ల లోపు మెజారిటీతో వీరందరూ విజేతలయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో 5000 ఓట్లు అటు ఇటయితే.. అక్కడ ఓటమి వీరిని వెంటాడిందని అర్థమవుతోంది.
టీఆర్ఎస్ సిట్టింగ్‌ల్లో 26 మంది కేవలం 10 వేల లోపు ఓట్లతోనే గెలిచారు. వీరందరికీ ఓట్ల గండం పొంచి ఉంది. ఇటీవల మునుగోడు బై ఎలక్షన్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కేవలం 10 వేల చిలుకు ఓట్లతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై గెలిచారు. మరో అయిదు వేల ఓట్లు బీజేపీ సాధించి ఉంటే.. టీఆర్ఎస్ అక్కడ ఓటమి పాలయ్యే పరిస్థితి కనిపించింది. అందుకే అత్తెసరు ఓట్ల మెజారిటీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలు గండంగానే భావించాలి. అటువంటి వారెవరు ఉన్నారో చూద్దాం. అయిదుగురు రాష్ట్ర మంత్రులతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కొందరు అదె సెగ్మెంట్ నుంచి వరుసగా మూడోసారి పోటీకి సిద్ధమవుతున్నారు.
మంత్రులు | నియోజకవర్గం | మెజారిటీ (2018) |
కొప్పుల ఈశ్వర్ | ధర్మపురి | 441 |
జగదీష్‌రెడ్డి | సూర్యాపేట | 5967 |
పటోళ్ల సబితారెడ్డి | మహేశ్వరం | 9227 |
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి | నిర్మల్ | 9271 |
పువ్వాడ అజయ్‌కుమార్ | ఖమ్మం | 10991 |
ఎమ్మెల్యేలు | ||
ఆత్రం సక్కు | అసిఫాబాద్ | 171 |
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | ఇబ్రహింపట్నం | 376 |
బొల్లం మల్లయ్య యాదవ్ | కోదాడ | 756 |
కాలేరు వెంకటేశం | అంబర్‌పేట | 1016 |
గ్యాదరి కిషోర్‌కుమార్ | తుంగతుర్తి | 1847 |
లావుడ్య రాములు | వైరా | 2013 |
రోహిత్‌రెడ్డి | తాండూర్ | 2875 |
బానోతు హరిప్రియ | ఇల్లందు | 2887 |
మెతుకు ఆనంద్ | వికారాబాద్ | 3092 |
జైపాల్ యాదవ్ | కల్వకుర్తి | 3447 |
వనమా వెంకటేశ్వరరావు | కొత్తగూడెం | 4139 |
గంప గోవర్ధన్ | కామారెడ్డి | 4557 |
ఎన్.దివాకర్‌రావు | మంచిర్యాల | 4848 |
బాపూరావు రాథోడ్ | బోథ్ | 6486 |
కందాల ఉపేందర్‌రెడ్డి | పాలేరు | 7669 |
షకీల్ మహమ్మద్ | బోదన్ | 8101 |
చిరుమర్తి లింగయ్య | నకిరేకల్ | 8259 |
దాసరి మనోహర్‌రెడ్డి | పెద్దపల్లి | 8466 |
గువ్వల బాలరాజు | అచ్చంపేట | 9114 |
పట్నం నరేందర్‌రెడ్డి | కొడంగల్ | 9319 |
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి | మునుగోడు | 10113 (2022 Bye Election) |