- ఇంటికి 3 లక్షలు.. 15 రోజుల్లో ప్రారంభం:కేసీఆర్
ఇళ్లు అడుగు జాగా ఉన్న పేద కుటుంబాలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు సాయం చేస్తామని, ఈ స్కీమ్‌కు15 రోజుల్లో అవసరమైన నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ స్కీము కింద పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు అదనంగా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తిచేసుకున్న కొత్త కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
2. అన్న బాటలో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)
తన సోదరుడు రాహుల్ గాంధీ బాటలో నడిచేందుకు సోదరి ప్రియాంక గాంధీ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది రెండు నెలలపాటు ప్రియాంక ‘మహిళా మార్చ్’ నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ఇది జరుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం రాహుల్ చేస్తున్న భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక మహిళా మార్చ్ ప్రారంభం కానుండడం గమనార్హం.
3. దవాఖాన్లపై సైబర్ దాడులు: (Cyber Attacks)
సైబర్ నేరగాళ్లు దవాఖాన్లపై పడ్డారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐదు సర్వర్లపై హ్యాకింగ్ దాడి జరిగి, ఇంకా పరిస్థితి చక్కబడక ముందే ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి హ్యాకర్ల బారిన పడిన విషయం వెలుగుచూసింది. ఈ సైబర్ దాడిలో ఎయిమ్స్‌కు జరిగిన నష్ట తీవ్రత కంటే సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి జరిగిన తీవ్రత తక్కువేనని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఆన్‌లైన్ కంటే మాన్యువల్‌గానే ఎక్కువ సేవలు అందిస్తుండడంతో, నష్ట తీవ్రత తక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ సైబర్ దాడులు చైనా నుంచి జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
4. తండ్రితో మరోసారి కవిత భేటీ:
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆదివారం ఉదయం మరోసారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎఫ్‌ఐఆర్ కోరుతూ కవిత శనివారం రాసిన లేఖకు సీబీఐ స్పందన ఎలా ఉండొచ్చు, ఆ తర్వాత ఎలాంటి స్టెప్స్ వేయాలన్నదానిపై న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ పాలమూరు పర్యటనకు వెళ్లారు.
5. మంచిగ చదువుకోర్రి.. యువతకు కేటీఆర్ లేఖ:
తెలంగాణలో కొలువుల కుంభమేళా సాగుతోందని.. హామీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తొమ్మిదేళ్లలోనే 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశంలోనే సరికొత్త చరిత్ర లిఖించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. యువత కష్టపడి చదివి కలలను నిజం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. బాగా చదివి ఉద్యోగ నోటిఫికేషన్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర యువతకు ఆదివారం ఆయన లేఖ రాశారు.
6. క్షమాపణలు చెప్పిన ఎంపీ:
హిందువులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం పార్లమెంటు సభ్యుడు, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ క్షమాపణలు చెప్పారు.బద్రుద్దీన్ అజ్మల్ గత శుక్రవారం హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అదే ముస్లిం యువకులు 21 ఏళ్ల నిండిన వెంటనే పెళ్లిళ్లు చేసుకుంటారని, హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని 40 ఏళ్ల వరకూ అవివాహితులుగానే ఉంటారని వ్యాఖ్యానించారు. ”ఇంత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు? హిందువులకు ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉండటానికి ఇదే కారణం. సారవంతమైన భూమిలో విత్తనాలు నాటితే మంచి ఫలితాలు వస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ల విషయంలో ముస్లింలు అనుసరించిన విధానాన్నే హిందువులు కూడా అనుసరించాలని సూచించారు.
7. షర్మిల కాదు.. శిఖండి:
రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. పాదయాత్ర పేరుతో సీఎం కేసీఆర్‌పై ఆమె విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆడపిల్ల కదా అని వదిలేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంతంలో రాజన్న రాజ్యాన్ని ఎవరు కోరుకోవడం లేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుపడకుంటే తెలంగాణ రాష్ట్రం ఏనాడో ఏర్పడేదన్నారు. ‘‘గతంలో మీ అన్న జగన్ సమైక్యవాదిగా మహబూబాబాద్ పర్యటనకు వస్తున్న సమయంలో ఇక్కడి ప్రజలు రాళ్లతో తరిమికొట్టిన్రు. మానుకోట రాళ్లకు పని చెప్పే పరిస్థితి మళ్లీ తీసుకురావొద్దు’’ అని షర్మిలను ఆమె హెచ్చరించారు.
8. ఖర్గే ఆన్ ఫైర్:
కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన తొలి సమావేశంలోనే పార్టీ నేతలకు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతతో పని చేయాలని లేదా పక్కకి తప్పుకుని తమ సహచరులకు అవకాశం ఇవ్వాలని లీడర్లకు స్పష్టం చేశారు. పై నుంచి కింది స్థాయి దాకా ఆఫీస్ బేరర్లు జవాబుదారీతనంతో ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ల పని తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే ఆధ్వర్యంలో తొలి సారిగా స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.
9. నేడు గుజరాత్‌లో పోలింగ్
గుజరాత్అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 182. డిసెంబర్ 1న జరిగిన తొలి దశ ఎన్నికల్లో సౌరాష్ట్ర, కుచ్, సౌత్ గుజరాత్ రీజియన్లలోని 89 సీట్లకు పోలింగ్ పూర్తయ్యింది. 63.31 శాతం పోలింగ్ రికార్డయ్యింది. ఇక మిగిలిన 93 సీట్లకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్తదితర జిల్లాల్లో పోలింగ్ (Gujarath Election) జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సహా 61 పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
10. నేనంటే కేసీఆర్‌కు వణుకు: షర్మిల
వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ షర్మిలరెడ్డి, ఎమ్మెల్సీ కవితకు చురకలంటించారు. టీఆర్ఎస్ మహిళా నేతలు లిక్కర్ స్కాంలో ఉంటే తాను మాత్రం ప్రజా సమస్యలపై పోరాడుతున్నానన్నారు. మహిళా నేత అయి ఉండి లిక్కర్ స్కాం లో ఉండడం ఏంది ? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆదరణ చూస్తే భయం వేస్తోందన్నారు. తన పాదయాత్ర కు వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కు వణుకుపుడుతోందన్నారు. ఆయనకు తానే ప్రత్నామ్నాయం అని వ్యాఖ్యానించారు.