సీబీఐకి ట్విస్ట్ ఇచ్చిన కవిత.. కవిత కేసుపై రేవంత్ రెడ్డి కొత్త కోణం.. జగ్గారెడ్డిపై మళ్లీ మాటలు పేల్చిన షర్మిల.. తెలంగాణలో పులి కలకలం.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే
1. ఎఫ్‌ఐఆర్ కాపీ ఇచ్చాక కలుద్దాం.. సీబీఐకి కవిత లేఖ
సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించింది. తనకు నోటీసులు ఇచ్చిన కేసుకు సంబంధించిన ఫిర్యాదు కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వాలని కోరుతూ సీబీఐకి శనివారం లేఖ రాసింది. ఆ కాపీలు ఇచ్చిన తర్వాత, అందులో ఏముందో చూసి తాను క్లారిఫికేషన్ ఇస్తానని లేఖలో పేర్కొంది.
2. కవితకు మినహాయింపు ఎందుకు?
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై తమకు అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. ఈ కేసులో నిందితులు అందరినీ ఢిల్లీకి పిలిచి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కవితను ఇంట్లోనే విచారణ చేస్తామనడంలో ఆంతర్యమేంటో సీబీఐ చెప్పాలన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు.
3. జగ్గారెడ్డి థర్డ్ క్లాస్!
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్‌ఆర్‌టీపీ ప్రెసిడెంట్ షర్మిలరెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి ఓ థర్డ్ క్లాస్ వ్యక్తి అని, ఆయన మాటలకు, చేతలకు విశ్వసనీయత లేదని దుయ్యబట్టారు. షర్మిల మాట తీరు సరిగా లేదని జగ్గారెడ్డి విమర్శించడంతో, షర్మిల ఇలా ఎదురుదాడి చేశారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారికి షర్మిల శనివారం నివాళులర్పించారు. శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చిన కేసీఆర్, ఓడిపోయిన తన బిడ్డ కవితను ఎమ్మెల్సీ చేశాడని షర్మిల విమర్శించారు.
4. శ్రీశైలం నీళ్లు చెరిసగం:
శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు, కరెంట్ రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా చెరిసగం పంచుకుందామని తెలంగాణ, ఏపీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉంటేనే కరెంట్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
5. లిక్కర్ కేసులో కేసీఆర్ పాత్ర!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని బీజేపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ ఎందుకు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలిశారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ, పంజాబ్ మద్యం పాలసీల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మద్యం పాలసిపై లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
6. థాయ్‌లాండ్ స్టూడెంట్‌పై ప్రొఫెసర్ దారుణం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణ ఘటన జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్ అమ్మాయిపై హిందీ ప్రొఫెసర్ రేప్ అటెంప్ట్ చేశాడు. హిందీ నేర్పిస్తానని శుక్రవారం సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించి ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. ప్రొఫెసర్ తనను బలవంతం చేస్తున్నాడని అక్కడ్నుంచే హాస్టల్ వార్డెన్‌కు ఆ అమ్మాయి ఫోన్ చేయడంతో, మళ్లీ ఆమెను తీసుకొచ్చి వర్సిటీలో దింపాడు. ఆమె వెళ్లి గచ్చిబౌళి స్టేషన్‌లో ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన స్టూడెంట్స్ ఆ ప్రొఫెసర్‌ను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని బుధవారం వర్సిటీలో ధర్నాకు దిగారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ ప్రకటించింది. థాయ్‌లాండ్ స్టూడెంట్ ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
7. నేడు పాలమూరుకు కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. కొత్త కలెక్టరేట్ బిల్డింగ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు.
8. ఇండియా నాలో ఒక భాగం:
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శనివారం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలో ఇండియన్ రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ‘‘ఇండియా నాలో ఒక భాగం.. నేను ఎక్కడికెళ్లినా నాతోనే ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. మధురైలో పుట్టిన పిచయ్‌కి ట్రేడ్, ఇండస్ట్రీ కేటగిరీలో 2022కి గాను పద్మభూషణ్ వరించింది.
9.76 శాతం రిజర్వేషన్లు:
చత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 76 శాతానికి పెంచింది. ఈ మేరకు రెండు సవరణ బిల్లులను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 5 గంటల చర్చ తర్వాత ఆ రెండు బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుల ప్రకారం ఎస్టీలకు 32 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఎస్సీలకు 13 శాతం రిజర్వేషన్లు ఉండగా.. ఈడబ్ల్యూఎస్ కోటా 4 శాతం ఉంది. ఈ రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అనంతరం ఐదుగురు మంత్రులు గవర్నర్ ను కలిసి, బిల్లులకు ఆమోదం తెలపాలని కోరారు.
10. నేటి నుంచి రీస్టార్ట్
వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ షర్మిలరెడ్డి ఆదివారం నుంచి తన ప్రజాప్రస్థానం పాదయాత్రను రీస్టార్ట్ చేస్తానని ప్రకటించింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నర్సంపేట్ నుంచి ఆమె యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, అనుమతిపై పోలీసులు ఇప్పటివరకూ ఎటూతేల్చలేదు. మరోవైపు చెన్నారావు పేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని షర్మిల ప్రకటించారు. లింగగిరి నుంచి యాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు యాత్రకు అనుమతి ఇవ్వాలని, దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు కోరుతున్నారు.
11. అసిఫాబాద్‌లో తల-మొండెం వేరు చేసిన పులి:
అసిఫాబాద్ జిల్లాలో మరో వ్యక్తిని పులి చంపేసింది. పత్తి చేనులో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసి తల నుంచి మొండాన్ని వేరు చేసింది. అసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని లక్కడికోట్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతుడు కురిసేంగే జంగుది మహారాష్ట్రలోని ఖిరిడి గ్రామం అని స్థానికులు తెలిపారు. గత నెలలో ఇదే జిల్లా వాంకిడి మండలంలో పులి ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసిన ఘటన మరువకముందే ఈ ఘటన జరగడంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.