Homelatestమరో రెండు భారీ జాబ్ నోటిఫికేషన్లు.. కేసీఆర్ సర్కార్ కు 396 సర్పంచ్ ల షాక్.....

మరో రెండు భారీ జాబ్ నోటిఫికేషన్లు.. కేసీఆర్ సర్కార్ కు 396 సర్పంచ్ ల షాక్.. ప్రముఖ క్రికెటర్ కు యాక్సిడెంట్.. హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. నేటి టాప్ టెన్ న్యూస్

5024 స్టాఫ్ నర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్


ప్రభుత్వ దవాఖాన్లు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌లో ఖాళీగా ఉన్న 5204 స్టాఫ్ నర్స్‌ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ( https://mhsrb.telangana.gov.in/ ) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(జీఎన్ఎం) కోర్సులు పూర్తి చేసి, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ర్టేషన్ చేయించుకున్న వాళ్లు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొంది.

గ్రూప్‌ 3 నోటిఫికేషన్ రిలీజ్


రాష్ట్రంలో 1365 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్​ కమిషన్ గ్రూప్3 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 26 డిపార్ట్​ మెంట్లలోని 107 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకూ ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది. వెకెన్సీల బ్రేకప్, ఏజ్, స్కేల్, కమ్యూనిటీ, క్వాలిఫికేషన్ తదితర వివరాలతో వచ్చేనెల జనవరి 24న డిటెయిల్స్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది.

ఒంటిగంట వరకూ రైళ్లు


నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు మెట్రో రైళ్లను నడుపుతామని హెచ్‌ఎంఆర్‌‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. శనివారం రాత్రి ఒంటి గంట వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని, ఒంటి గంటలకు మెట్రో ఎండింగ్ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. చివరి రైళ్లు 2 గంటలకు గమస్థానాలను చేరుకుంటాయని పేర్కొన్నారు. రైళ్లు, స్టేషన్లలో మద్యం తాగి దుర్భాషలాడకుండా మైట్రో రైల్ పోలీసులు, సెక్యూరిటీ వింగ్‌ల నిఘా ఉంచుతామని తెలిపారు.

రోడ్డెక్కిన పత్తి రైతులు


గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు రోడ్డెక్కారు. రోజు రోజు పడిపోతున్న పత్తి ధరలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. రైతు హక్కుల పోరాట సమితి (ఆర్​హెచ్​పీఎస్​) పిలుపు మేరకు ఆసిఫాబాద్ నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి.. అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించారు. పత్తి పంటకు క్వింటాలుకు రూ. 15 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

రేపటి నుంచి నుమాయిష్‌


నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధం అయింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్‌) జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో స్టాళ్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఏడాది దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2,400 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఎంట్రీ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు.

సర్కార్‌‌కు సర్పంచుల సవాల్


రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మల్ జిల్లాలోని 396 మంది సర్పంచులు అల్టిమేటం జారీ చేశారు. సర్కారుకు వారం రోజులు టైమ్ ఇస్తున్నామని, ఈలోగా బకాయిలు చెల్లించాలని, లేదంటే మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఆఫీసర్ల ఒత్తిడితో అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నదని సర్పంచులు వాపోయారు. తెచ్చిన అప్పులకు మిత్తీలు పెరిగిపోతున్నాయని, భార్యల మెడల్లోని పుస్తెల తాళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూఇయర్‌‌కు ట్రాఫిక్ ఆంక్షలు:


న్యూఇయర్ వేడుకలకు గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో భద్రత పెంచారు. డిసెంబర్ 31న నైట్ పార్టీలకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు పర్మిషన్ ఇచ్చారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఔట్ డోర్ డీజేలపై నిషేధం విధించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. బేగంపేట్, లంగర్‌‌హౌస్‌ ఫ్లైఓవర్లు మినహా మిగతావన్నీ మూసేస్తామని చెప్పారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఎయిర్‌‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో వాహనాలను అనుమతించబోమన్నారు. ఈ ఆంక్షలు శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అమల్లో ఉంటాయి.

తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ (99) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వయో భారంతో బాధపడుతున్న హీరా బెన్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్‌‌లో జాయిన్ చేశారు. గురువారం ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. అయితే చికిత్స కొనసాగుతుండగానే శుక్రవారం తెల్లవారుజామున 3.30కి మృతి చెందారని ఆస్పత్రి విడుదల బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో గాంధీనగర్‌‌లో ఉదయం 9.30కి హీరా బెన్ అంత్యక్రియలు ముగిశాయి. మోదీకి పలు దేశాల అధినేతలు సంతాపం తెలిపారు.

టన్నెల్‌లో చిక్కుకున్న 400 వెహికిల్స్‌:


హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ మంచు కారణంగా స్థానికులు, టూరిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం మనాలి–-లేహ్ హైవే, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా మంచు కురవడంతో రోహ్​తంగ్‌ అటల్ టన్నెల్‌లో సుమారు 400 వెహికల్స్ చిక్కుకుపోయాయి. దీంతో అందులోని టూరిస్టులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు12 గంటలు శ్రమించి టన్నెల్‌లో చిక్కుకున్న వెహికల్స్ అన్నింటిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.

రిషబ్‌పంత్‌కు యాక్సిడెంట్‌


భారత క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా.. రూర్కి వద్ద ప్రమాదం జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీ కొట్టింది.కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ కోసం ఢిల్లీకి తరలించారు. ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ముగిసిన ప్రెసిడెంట్ పర్యటన


రాష్ర్టంలో రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది కోసం రాష్ర్టపతి ఈనెల 28న తెలంగాణ పర్యటనకు వచ్చారు. మూడో రోజుల పర్యటనలో రాష్ర్టపతి హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనటంతో పాటు ఏపీలోని శ్రీశైలం, భద్రాచలం, రామప్ప, యాదాద్రి, ముచ్చింతల్ సమతా మూర్తి ప్రాంతాల్లో పర్యటించారు. శుక్రవారం సాయంత్రం హకీంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రాష్ర్టపతి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc