నేడే బీఆర్ఎస్ నాందేడ్ సభ.. ప్రముఖ సింగర్ కన్నుమూత.. రేపటి నుంచే రేవంత్ యాత్ర.. అగ్నివీర్ నియామకాల్లో మార్పులు.. ప్రారంభమైన పెద్దగట్టు జాతర.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే

నేడే బీఆర్ఎస్ బహిరంగ సభ

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమే లక్ష్యంగా వ్యూహాలు సాగిస్తోన్న సీఎం కేసీఆర్.. నేడు మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్కడి గురుగోవింద్‌ సింగ్‌ మైదానంలో మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ బీఆర్ఎస్ పార్టీ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాందేడ్‌ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా గులాబీమయమైంది. సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

రేపు రాష్ట్ర బడ్జెట్


తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 8న సాధారణ చర్చ జరగనుంది. 9, 10, 11 తేదీల్లో పద్దులు.. 12న ద్రవ్య వినిమయ బిల్లు ఉంటుంది. ఈ రోజు జరగనున్న మంత్రి మండలి సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.

ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజం

మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టిందని.. హర్ ఘర్ జల్ పేరుతో నీళ్లు ఇస్తున్నానని కేంద్రం చెప్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంటింటికి ఇళ్లు ఇవ్వండి కానీ.. విషం నింపకండి అంటూ కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. విపక్షాలు తమ కుటుంబంపై చేస్తున్న విమర్శలపై స్పందించిన కేటీఆర్.. అవును.. మాది కుటుంబ పాలనేనని.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబమేనంటూ వాఖ్యానించారు. పోడు భూముల విషయంలో తప్పుబట్టాల్సి వస్తే.. అది కాంగ్రెస్‌నే అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి నీళ్లకు ఇబ్బంది ఉండేదని.. ఊరు వెళ్దామంటే భయపడాల్సి పరిస్థితి ఉండేదన్నారు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేటీఆర్ వివరించారు.

వాణీ జయరాం కన్నుమూత:

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు ఆలపించారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించిన ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

రేపటి నుంచే రేవంత్ యాత్ర:

హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధానం నుంచి సోమవారం ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితర ముఖ్యనేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రాహుల్‌ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందని, పార్టీ నాయకులంతా దీన్ని సమన్వయంతో అమలు పరుస్తారని పేర్కొన్నారు. 6న ప్రారంభం కానున్న జోడో యాత్ర.. ఈ నెల 22 వరకు కొనసాగుతుందని, 24 నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో యాత్రకు విరామం ఇస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ కొనసాగుతుందని, మొత్తం రెండు నెలల పాటు ఈ యాత్రలు కొనసాగుతాయని వెల్లడించారు.

ప్రారంభమైన పెద్దగట్టు జాతర:

రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర ఈ రోజు ప్రారంభమైంది. ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర మొదటి రోజైన ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి యాదవ భక్తులు బోనాలు, గంపలతో ప్రదక్షిణలు చేస్తారు. రెండో రోజైన సోమవారం చౌడమ్మ తల్లికి బోనాల చెల్లింపు.. తెల్లవారుజామున జంతువుల బలి. మూడో రోజు మంగళవారం లింగమంతులస్వామి గుడి ముందు చంద్రపట్నం వేస్తారు. నాలుగో రోజు బుధవారం నెల వారం వేస్తారు. చివరి రోజైన ఐదో రోజు గురువారం దేవరపెట్టెకు పూజలు చేసి కేసారం తరలించడం ద్వారా జాతర ముగుస్తుంది.

వందేభారత్ రైలుపై దాడి:

ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ రైలు శుక్రవారం సాయంత్రం ఖమ్మం రైల్వేస్టేషన్‌ దాటిన వెంటనే గుర్తుతెలియని ముగ్గురు యువకులు రాళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో రైలు కోచ్‌ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దుండగుల్ని గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని ఆర్‌పీఎఫ్‌ పోలీసులు తెలిపారు.

అగ్నివీర్ నియామకాల్లో మార్పులు:

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పులు చేసింది. ఇప్పుడు సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా నామినేట్ చేసిన కేంద్రాలలో ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)కి హాజరు కావాలి. తర్వాత రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. ఉద్యోగ ఎంపికకు ముందు మెడికల్ టెస్ట్ చేస్తారు.

నాపై దాడులు: షర్మిల

పాదయాత్ర చేస్తున్న తనపై దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో మళ్లీ సీన్ రిపీట్ చేయాలని చూశారని ఆమె అన్నారు. పాదయాత్ర కవరేజ్ కి వచ్చిన మీడియాపై దాడులకు దిగారన్నారు. ప్రజల పక్షాన నిలబడడమే తాను చేసిన తప్పా అన్నారు. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నామని షర్మిల అన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here