ఇప్పుడంటే రాజశేఖర్ ఫెడౌట్ హీరో కానీ ఒకప్పుడు పోలీసు పాత్రల్లో అద్భుతంగా నటించి బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరో. అప్పట్లో ఆయన్ను అందరూ ‘యాంగ్రీ యంగ్‌మెన్’గా పిలుచుకునేవారు. ఈ బిరుదు ఆయనకు వచ్చేలా చేసిన సినిమా అంకుశం.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్.ఆర్ట్ మూవీస్ పతాకంపై శ్యాం ప్రసాద్ రెడ్డి రెడ్డి నిర్మించారు. రాజశేఖర్ సరసన జీవిత హీరోయిన్ గా నటించింది. రామిరెడ్డి కీలక పాత్ర పోషించారు. సత్యం సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలు అందించాక చెళ్ళపిళ్ళ సత్యం చనిపోయారు.
సెప్టెంబరు 28, 1990 లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో రాజశేఖర్ కు తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మొత్తం 66 సెంటర్లలో 50 రోజులు, 13 సెంటర్లలో 100 రోజులు ఆడింది. బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్లను కొల్లగొట్టింది.
ఈ సినిమాను చూసి ఫిదా అయిపోయిన హీరో చిరంజీవి దీనిని హిందీలో రీమేక్ చేశారు. అదే ప్రతిబంధ్. బాలీవుడ్ లో చిరుకు ఇదే ఫస్ట్ మూవీ. ఇందులో చిరంజీవి సరసన జూహి చావ్లా హీరోయిన్ గా నటించగా రామిరెడ్డినే విలన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990లో రిలీజైన ఈ మూవీ అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
దీనిని కన్నడలో అభిమన్యు టైటిల్ తో 1990 లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. వి. రవిచంద్రన్ టైటిల్ రోల్ పోషించగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.