తరుణ్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నువ్వు లేక నేను లేను. సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్నీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా 2002 జనవరి 14న రిలీజైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.
రాధాకృష్ణ (తరుణ్), కృష్ణవేణి(ఆర్తి అగర్వాల్) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వారి తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులు, కలిసి వ్యాపారం చేస్తుంటారు. రాధా,కృష్ణ చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారుతుంది. వారి తల్లిదండ్రులు చేస్తున్న వ్యాపారం కొంచెం ఒడిదుడుకులకు లోనవడంతో రామచంద్రయ్య( కె.విశ్వనాథ్) సహాయం చేస్తాడు.
ప్రతిఫలంగా ఆయన మనవడికి కృష్ణవేణినిచ్చి పెళ్ళిచేయమని కోరతాడు. ఆయన చేసిన సాయానికి రాధాకృష్ణ తన ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. కృష్ణవేణి కూడా అందుకు అయిష్టంగానే అంగీకరిస్తుంది. అయితే చివర్లో పెద్దలు వారి త్యాగాన్ని గుర్తించి ప్రేమికుల్నిద్దరినీ కలపుతారు.
ముందుగా ఈ సినిమాను స్టార్ హీరోలతో చేయాలని అనుకున్నారు సురేష్ బాబు. అందులో భాగంగా మహేష్ తో చేయాలని అనుకున్నారు. కానీ కాశీ విశ్వనాథ్ మహేష్ బాబుతో సినిమా అంటే నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది. మహేష్ తో చేసేందుకు చాలా మంది క్యూలో ఉంటారు. తరుణ్ అయితే ఈ కథకి సరిగ్గా సరిపోతాడని, అప్పుడే నువ్వే కావాలి లాంటి మంచి హిట్ తో ఫామ్ లో ఉన్నాడని సురేష్ బాబుతో చెప్పారట.
దీనితో రోజారమణి దగ్గరికి వెళ్లి కథ చెప్పి.. అడ్వాన్సు కూడా ఇప్పించారట కాశీ విశ్వనాధ్. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఫుల్ క్రేజ్ కొట్టేసిన ఆర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక సినిమాలో రామచంద్రయ్య పాత్రని రంగనాథ్ తో చేయిద్దామని సురేష్ బాబు అంటే.. ఆ పాత్రకు దర్శకుడు విశ్వనాధ్ అయితే సరిగ్గా సరిపోతారని పట్టుబట్టి ఆయన్నే తీసుకున్నారట కాశీ విశ్వనాధ్.