శివ సినిమాతో ఒక్కసారిగా సెన్సెషనల్ డైరెక్టర్ గా మారారు రామ్ గోపాల్ వర్మ. దీంతో వర్మతో సినిమా చేయడానికి చాలామంది స్టా్ర్ హీరోలు లైన్ కట్టారు. అందులో వెంకటేష్ ఒకరు. 1991లో వెంకటేష్, శ్రీదేవి మొయిన్ లీడ్ లో వర్మ తెరకెక్కించిన చిత్రం క్షణక్షణం. కొన్ని నిజ సంఘటనల అధారంగా, కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేశారు వర్మ. ఈ సినిమా తొలివిడత విడుదలైన సమయంలో సరిగా ఆడలేదు. మలివిడత విడుదలైన తర్వాతే విజయం సాధించి ఇప్పటికీ ఎంతో మంది చూస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీదేవి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. శ్రీదేవికి నటనా చాతుర్యం, ఆహార్యం, వయస్సు దాటినా వన్నె తరగని అందంతో అభిమానులను అలరించింది. ఈ సినిమా చూస్తున్నపుడు శ్రీదేవి నటన ఎంతో కష్టపడి చేసిందో అనిపిస్తుంది. ఈ సినిమాలో సహజత్వంతో కూడుకొన్న ఆమె నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్నిచోట్ల ఆమె ముఖంలో పలికించే హావభావాలు బాగుంటాయి. అందుకేనేమో వర్మ ఈ చిత్రాన్ని ‘శ్రీదేవికి నేను రాసిన ప్రేమలేఖ’ అంటాడు.
ఈ సినిమాలో హీరో వెంకటేష్ అయినప్పటికీ శ్రీదేవే తెరపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడవిలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో వెంకటేష్ కాలు జారిన తరువాత ఆమె నవ్వుతూనే ఉండే సన్నివేశం ఉంది. అక్కడ ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. వెంకటేష్ కల్పిత కథ పాత్ర ఫ్లాష్ బ్యాక్ గురించి చెపుతుంటే, ‘ఈ సినిమా నేను చూసానంటూ’ శ్రీదేవి ఓ సన్నివేశంలో నవ్వులు పూయిస్తుంది.
శ్రీదేవి అప్పటికే ఎన్నో సినిమాలు చేసినా కూడా, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత సంతరించుకొంది. పాటల్లో అయితే శ్రీదేవి చిలిపితనం మరింత స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఇప్పటికీ ఆ సినిమా ఒక దృశ్య కావ్యమే! ఆమె నటన కోసం మరలా చూడాలనిపిస్తుంది… శ్రీదేవి నిజంగా పరిపూర్ణత పొందిన నటి అని చెప్పాలి.